Sunday, May 22, 2011

ఓ వెన్నెల.. ఓ వేకువ.. ఓ వేటూరి..

ఆకుచాటు తడిసిన పిందెలా.. ఆరేసుకోబోయి పారేసుకున్న జరీ చీర జిలుగులా.. రవివర్మకు అందని అందాల్ని అందించిన భావకుడిలా.. పదాల్నితాకి కవితా గౌతమిని ప్రవహింప చేసిన భగీరధుడిలా.. చల్లగాలిలా.. మల్లెపూవులా.. ఒక చిన్న మాటతో అనంత రాగాల్ని పలికించిన వీణలా.. కొమ్మకొమ్మకో సన్నాయిలా.. ఝమ్మన్న నాదంలా.. .. వేణువైన భువనంలా.. గాలిలో కలసిన గగనంలా.. తెలుగు అలంకారాలతో చెడుగుడు ఆడుకున్న మరపు రాని రచయిత వేటూరి.

సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా

తిరిగే భూమాతవు నీవైవేకువలో వెన్నెలవై

కరిగే కర్పూరము నీవైఆశలకే హారతివై

వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే

లోకమెన్నడో చీకటాయెలే.. అంటూ అద్భతమైన తన కవనంతో

శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు వేటూరి.

సీత కధతో సినీ ప్రస్థానం ప్రారంభించిన వేటూరి.. సంగీత దర్శకుల బాణీలకు రంగురంగుల పదాల వోణీలు కట్టారు. పాటకు పైటేసి సిగ్గుల మెగ్గని చేసారు. అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఎన్నో సినిమాలు... అజరామరమైన గీతాలు.. ఆయన కలం నుంచి జాలువారాయి.

పండితుల్ని పామరుల్ని సరిసమానంగా అలరించిన కవి వేటూరి. ఆయనో ఆధునిక శ్రీనాధుడు. పగలంతా బాధించే దిగుల్ని.. రేయింతా వేధించే సెగల్ని వేటూరిలా చెప్పగల కవులు చాలా అరుదు.

గోదావరికి వేటూరికి ఏదో అవినాభావ సంబంధం. ఎప్పుడు వెన్నెలని.. వెన్నల్లో తడిసి ముద్దయిన గోదావరిని చూసినా ఆయన కలం ఉరకలేస్తుంది. వెన్నల్లో గోదారి అందాన్ని అంత అద్భుతంగా చెప్పిన వాడు వేటూరి.

హృదయ గాయాలకి మృదుగేయ ఔషధాలను ఆర్పించిన వాక్య వైద్యుడు వేటూరి. ఆత్రేయలోని భావసౌందర్యాన్ని, సి.నారాయణరెడ్డిలోని భాషా పటిమనుశ్రీశ్రీ లోని సామాజిక చైతన్య స్ఫూర్తిని రంగరించి రూపుదాల్చిన మూర్తివేటూరి సుందరరామమూర్తి. తెలుగు పాటల పూదోటలో కొమ్మకొమ్మకో సన్నాయి పలికించి.. రాలేటి పూలతో రాగాలు పలికించిన చరితార్ధుడు వేటూరి. ప్రియా ప్రియతమా అంటూ ఎప్పుడూ గుండెల్లో ధ్వనిస్తూనే ఉంటాడు.

ఆధునిక సినీకవిత్రయం ఎవరంటే ఆత్రేయ.. శ్రీశ్రీ.. వేటూరి.. అని చెప్పుకోవచ్చు. పద లాలిత్యంలోనూ.. భావ వైవిధ్యంలోనూ.. ముగ్గుర్లో ఎన్నో పోలికలు.. సామీప్యతలూ ఉన్నాయి. ముగ్గురి అవసానదశ దాదాపు ఒకే రకంగా గడచింది.

కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో

తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే

చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా

పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు.. అంటూ వేదాంతాన్ని ప్రేమని మానవత్వాన్ని రంగరించి రాగంలా మార్చిన వేటూరి చిరస్మరనీయుదు.

ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలోఒక పూటలొనె రాలు పూవులెన్నో అంటూ వేదాంతిలా వెళ్ళిపోయిన వేటూరి.. మనకు తన ఙ్ఞాపకాలు.. పాటలు.. మిగిల్చివెళ్ళారు. వెన్నెల్ని.. వేకువని.. వేటూరిని ఎలా మరిచిపోగలం..

(ఈ రోజు వేటూరి వర్థంతి సందర్భంగా)

Wednesday, May 11, 2011

రజినీకాంత్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?


ఇప్పుడు అందరి దృష్టి సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌పైనే. ఆయన ఆరోగ్యం ఇప్పటికీ అలాగే ఉందా? కొత్త సినిమా 'రాణా' షూటింగ్‌కు ఆయన ఆరోగ్యం అడ్డంకిగా మారిందా? అసలు ఇప్పట్లో రజినీ సినిమా లేనట్లేనా?

సూపర్‌స్టార్ రజనీకాంత్ అనారోగ్యం కారణంగా.. ఆయన కొత్త సినిమా రాణా చిక్కుల్లో పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రజనీ అనారోగ్యం కారణంగా రాణా మూవీ షూటింగ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగడం లేదు. కొద్ది రోజులు అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు రజినీ. అనారోగ్యం నుంచి రజనీ కోలుకుంటున్నప్పటికీ, షూటింగ్‌లో ఇప్పుడే పాల్గొనకూడదని డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు అతడిని అమెరికాలోని స్పెషలిస్ట్‌లకు డాక్టర్లు సూచించినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన రజినీ ఫ్యామిలీ డాక్టర్లతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
చికిత్సకోసం రజనీ త్వరలోనే అమెరికాకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఫలితంగా రాణా షెడ్యూల్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని యూనిట్ భావిస్తోంది.
ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన రాణా సినిమాలో రజనీ మూడు గెటప్పుల్లో నటిస్తున్నాడు. అందులో ఓ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. రోల్ చేయాలంటే ఎంతో ఫిజికల్ ఎనర్జీ కావాలి. ఈ నేపథ్యంలో ఆ పాత్ర చేసేందుకు రజినీ ఆరోగ్యం ఎంత వరకు సహకరిస్తుందనేది ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్న.


రాణా షూటింగ్‌ ప్రారంభమైన తొలి రోజే రజినీ అస్వస్థతకు గురయ్యాడు. కోలుకున్న కొద్ది రోజులకే మళ్లీ అదే పరిస్థితి. అసలు రాణా సినిమాకే రజినీ ఆరోగ్యం ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతోంది? అప్పుడు అందరికి వస్తున్న డౌట్‌ ఇదే. రజినీ చేస్తున్న మూడు గెటప్పుల్లో ఒకటి యువకుని పాత్ర. ఆ పాత్ర కోసం రజినీ ఏకంగా పదిహేను కిలోలు తగ్గాల్సి వచ్చిందట. 75 కిలోలు ఉన్న రజినీ 60 కిలోలకు చేరాడంట. ఇదే ఆయన ఆరోగ్యానికి అసలు కారణంగా తెలుస్తోంది.

మరి ఈ పరిణామాల నేపథ్యంలో రాణా షూటింగ్‌‌కు తాత్కలికంగా బ్రేక్‌ పడే అవకాశాలున్నాయని చెన్నై ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి. సూపర్‌స్టార్‌ త్వరగా కోలుకుని మరింతా ఉత్సాహంగా సినిమా పూర్తిచేయాలని ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు. 'రోబో' కంటే రాణాతో మరింతా తమను అలరిస్తాడని సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.