Sunday, June 5, 2011

అలుపెరగని సుదీర్ఘ బాటసారి..మూవీ మొఘల్‌

ఆయన చదివింది సినిమా. ఆయనకు తెలిసింది సినిమా. అందుకే ఆయన మూవీ మొఘల్అయ్యారు. గిన్నిస్బుక్లో చోటు సంపాదించారు. నటరత్న ఎన్టీఆర్దగ్గర్నుంచి ఇప్పటి అల్లరి నరేశ్వరకు ఎంతోమందితో సినిమాలు నిర్మించారు. మరెంతో మందిని వెండితెరకు పరిచయం చేశారు. ఆయనే శతాధిక చిత్రాల నిర్మాత డాక్టర్డి. రామానాయుడు. ఇలా ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించి నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుని 76 ఏట అడుగుపెడుతున్నారు.

మూవీమెఘల్‌గా తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని వ్యక్తి డాక్టర్‌ డి. రామానాయుడు. సినిమా ప్రపంచంలోకి వెళ్ళాలని కోరికతో స్వయంగా సినిమా నిర్మాణాన్ని చేపట్టాలని భావించారు రామనాయుడు. తొలుత కో-ప్రోడ్యూసర్‌గా మరోకరితో కలిసి అనురాగం అనే సినిమాను నిర్మించారు. ఇక ఆ తరువాత సొంత నిర్మాణం సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను స్థాపించి తొలి చిత్రమే ఎన్టీఆర్‌ హీరోగా తీశారు. రాముడు-భీముడుగా ఎన్టీఆర్‌ను డ్యూయల్‌ రోల్‌లో చూపించి ఫస్ట్‌ మూవీతోనే సూపర్‌ సక్సెస్‌ను సాధించారు. అయితే ఆ ఫస్ట్‌ హిట్‌ మూవీని రీమేక్‌ చేయాలన్న కోరికతో ఉన్నారు రామానాయుడు.

రాముడు భీముడు భారీ హిట్‌ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు రామానాయుడు. ఎన్టీఆర్‌తో అయన తీసిన మరో చిత్రం శ్రీకృష్ణ తులాభారం. ఈ పౌరణికం ప్రేక్షకులను బాగా అలరించింది.

పట్టుదలనే అస్త్రంగా చేసుకుని మరికొన్ని సినిమాలకు శ్రీకారం చుట్టారు రామానాయుడు. ఆ సమయం కొన్ని సినిమాలు వరుసగా ప్లాప్‌ అయ్యాయి. అప్పుడు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్‌ ఆయనకు నైతిక మద్దతునిచ్చారు. ఆ డూ ఆర్‌ డై పొజిషన్‌లో రామానాయుడు తీసిన చిత్రం "ప్రేమనగర్". అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ మూవీ రామానాయుడికి ఎంతో కీర్తి ప్రతిష్టల్నీ సంపాదించి పెట్టింది. తెలుగు సినీ చరిత్రలో ఇదొక మైలురాయిలా నిలిచిపోయింది.

ఆ తర్వాత రామానాయుడి ఖాతాలో చేరిన మరో బ్లాక్‌ బస్టర్‌ మూవీ దేవత. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్‌బాబు, మోహన్‌బాబు, శ్రీదేవి, జయప్రద ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ అప్పట్లో ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా అలరించింది.

ఇప్పటి వరకు రామానాయుడు నిర్మించిన సినిమాల సంఖ్య నూట పాతిక. ఇందులో 75 తెలుగు సినిమాలు, 19 హిందీ సినిమాలు, 24 తమిళ చిత్రాలు, బెంగాలీలో రెండు సినిమాలు, రెండు కన్నడ చిత్రాలు, ఓరియా, అస్సామి భాష చిత్రాలు కూడా ఉన్నాయి.

నిర్మాత సక్సెసయిన రామానాయుడు తన వారసులను వెండితెరకు పరిచయం చేశారు. తనయుడు సురేష్‌బాబు నిర్మాతగా, హీరోగా వెంకటేష్‌, రీసెంట్‌గా మనవడు రానా.. తమ తమ సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు.

తన వారసులనే కాదు ఎంతోమందిని సిల్వర్‌ స్క్రీన్‌కు ఇంట్రడ్యూస్‌ చేసిన క్రెడిట్‌ కూడా రామానాయుడిదే. ఆరుగురు హీరోలు, 12 మంది హీరోయిన్లు, 21 మంది దర్శకులను, 7 గురు మ్యూజిక్ కంపోజర్లు... మరెంతో మంది క్యారెక్టర్‌ ఆర్టిస్టులను సినీ రంగానికి తీసుకొచ్చిన ఘనత రామానాయుడుది. అంతేకాదు. పాతికేళ్ళుగా తెలుగు ప్రేక్షకులను నవ్వుల సాగరంలో ముంచేస్తున్న బ్రహ్మనందాన్ని సిల్వర్‌ స్క్రీన్‌కు ఇంట్రడ్యూస్‌ చేసింది కూడా ఆయనే.

ఇక సినిమాలను ఏదో ఊరికే తీయడం అంటే ఆయనకు నచ్చదు. దర్శకులకు పూర్తి స్వేచ్చనిచ్చే ఆయన... నిర్మాతగా అనేక సూచనలిస్తారు. తన అభిరుచులను సినిమాల్లో ఉండేలా చూసుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే అదే ఆయన్ను విజయవంతమైన నిర్మాతగా నిలబెట్టింది. సినిమా పట్ల ఆయన తీసుకునే ప్రత్యేకమైన శ్రద్ధే సినిమా విజయానికి కారణమని ఆయన దగ్గర పనిచేసిన చాలా మంది దర్శకులు అనేక సందర్భాల్లో చెబుతుంటారు.

సినిమాలే తన ప్రపంచంగా మార్చుకున్న ఆయన ఈ రంగంలో అనేక రికార్డులు సాధించారు. అందులో చెప్పుకోవాల్సింది గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌. తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది సాధించిన ఈ ఘనతలో రామానాయుడు ఒకరు. దేశంలో సినీప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు సాధించిన ఘనత కూడా మూవీ మెగల్‌ది.

ఇక వ్యక్తి గతంగానూ ఆయన చేసిన సేవలకు అనేక గౌరవాలు దక్కాయి. ఇక సినీ రంగానికే కాదు తన ఎదుగుదలకు తొడ్పడ్డ ప్రేక్షకులకు, ప్రజలకు కూడా సేవ చేస్తున్న వ్యక్తి రామానాయుడు. రాజకీయాల్లో వచ్చి సేవ చేయడంతో పాటు ట్రస్ట్‌ ద్వారా తన సొంత డబ్బులో అనే సేవా కార్యక్రమాలు నిర్వహించారాయన.

రామానాయుడు నాలుగు దశాబ్ధాలుగా తెలుగు సినీ పరిశ్రమను చూస్తున్నారు. తనదైన స్టైల్లో సినిమాలను చూపిస్తున్నారు. అగ్రతారలందరితో సినిమాలు తీసిన ఆయన వారి స్టార్‌ డమ్‌ను మరింతగా పెంచారు.

ఓ రాముడు భీముడు, ఓ ప్రేమ్‌నగర్‌, ఓ సొగ్గాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు... ఇవన్నీ ఆయన సారధ్యంలోనే వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. నాలుగు దశాబ్దలుగా సినీ వినీలాకాశంలో హీరోలకు, దర్శకులకు ధీటుగా స్టార్‌ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్న వ్యక్తి ఒక్క రామానాయుడు మాత్రమే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

అయన అలుపెరగని సుదీర్ఘ బాటసారి.. ఎవ్వరు సాధించలేని ప్రపంచరికార్డులు ఒంటి చేత్తో సాధించగల నేర్పరి.. హిట్‌ సాధించేంతవరకు నిద్దురపోని గడుసరి.. ఆ మూవీమొఘల్‌కు బర్త్‌ డే విషెస్‌ అందిద్దాం.

-స్వామి ముద్దం


Friday, June 3, 2011

స్టార్ హీరోల శివతాండవం

స్టార్‌ హీరోలు శివతాండవం చేస్తున్నారు. మొన్న చిరంజీవి.. నిన్న మహేష్‌, పవన్‌, ఇప్పుడు అల్లుఅర్జున్ తమ సినిమాల్లో శివ నామస్మరణ వినిపిస్తున్నారు. తాజాగా నాగార్జున శివ నామస్మరణతో డమరుకం మోగించబోతున్నాడు.


శివుని పాటలు స్టార్‌ హీరోల సినిమాలకు కొత్త జోష్‌ తీసుకువస్తున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఇంద్రలో శివుని పాట ఉంది. భం భం భోలే అంటూ వారణాసిలో జోరుగా ఆడిపాడాడు మెగాస్టార్‌.

ప్రిన్స్‌ మహేష్‌ కూడా తన సినిమాలో శివుని పాట పెట్టుకున్నాడు. సదా శివ అంటూ సాగే ఖలేజాలోని సాంగ్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచింది.

ఇటీవల వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ తీన్‌మార్‌లోనూ శివుని సాంగ్‌ ఉంది. జగమేలు శివశంకరా.. అంటూ శివున్ని తలుచుకున్నాడు పవర్‌స్టార్‌.

ఇక బద్రినాథ్‌లోనూ ఓం కారేశ్వరీ అంటూ ఓ భక్తిగీతం ఉంది. బద్రినాథ్‌ నేపథ్యంలో సాగిన ఈ పాటలో అల్లుఅర్జున్‌ జోష్‌గా స్టెప్పులేశాడు.

ఇక నాగార్జున తన కొత్త సినిమా డమరుకంలో కూడా శివుని సాంగ్‌ పెట్టబోతున్నారట. శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం శివుని నేపథ్యంతో సాగనుందని తెలుస్తోంది.

ఇలా శివుని పాటలపై టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మోజు పడుతున్నారు. శివనామస్మరణ చేస్తునేవున్నారు.

Sunday, May 22, 2011

ఓ వెన్నెల.. ఓ వేకువ.. ఓ వేటూరి..

ఆకుచాటు తడిసిన పిందెలా.. ఆరేసుకోబోయి పారేసుకున్న జరీ చీర జిలుగులా.. రవివర్మకు అందని అందాల్ని అందించిన భావకుడిలా.. పదాల్నితాకి కవితా గౌతమిని ప్రవహింప చేసిన భగీరధుడిలా.. చల్లగాలిలా.. మల్లెపూవులా.. ఒక చిన్న మాటతో అనంత రాగాల్ని పలికించిన వీణలా.. కొమ్మకొమ్మకో సన్నాయిలా.. ఝమ్మన్న నాదంలా.. .. వేణువైన భువనంలా.. గాలిలో కలసిన గగనంలా.. తెలుగు అలంకారాలతో చెడుగుడు ఆడుకున్న మరపు రాని రచయిత వేటూరి.

సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా

తిరిగే భూమాతవు నీవైవేకువలో వెన్నెలవై

కరిగే కర్పూరము నీవైఆశలకే హారతివై

వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే

లోకమెన్నడో చీకటాయెలే.. అంటూ అద్భతమైన తన కవనంతో

శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు వేటూరి.

సీత కధతో సినీ ప్రస్థానం ప్రారంభించిన వేటూరి.. సంగీత దర్శకుల బాణీలకు రంగురంగుల పదాల వోణీలు కట్టారు. పాటకు పైటేసి సిగ్గుల మెగ్గని చేసారు. అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఎన్నో సినిమాలు... అజరామరమైన గీతాలు.. ఆయన కలం నుంచి జాలువారాయి.

పండితుల్ని పామరుల్ని సరిసమానంగా అలరించిన కవి వేటూరి. ఆయనో ఆధునిక శ్రీనాధుడు. పగలంతా బాధించే దిగుల్ని.. రేయింతా వేధించే సెగల్ని వేటూరిలా చెప్పగల కవులు చాలా అరుదు.

గోదావరికి వేటూరికి ఏదో అవినాభావ సంబంధం. ఎప్పుడు వెన్నెలని.. వెన్నల్లో తడిసి ముద్దయిన గోదావరిని చూసినా ఆయన కలం ఉరకలేస్తుంది. వెన్నల్లో గోదారి అందాన్ని అంత అద్భుతంగా చెప్పిన వాడు వేటూరి.

హృదయ గాయాలకి మృదుగేయ ఔషధాలను ఆర్పించిన వాక్య వైద్యుడు వేటూరి. ఆత్రేయలోని భావసౌందర్యాన్ని, సి.నారాయణరెడ్డిలోని భాషా పటిమనుశ్రీశ్రీ లోని సామాజిక చైతన్య స్ఫూర్తిని రంగరించి రూపుదాల్చిన మూర్తివేటూరి సుందరరామమూర్తి. తెలుగు పాటల పూదోటలో కొమ్మకొమ్మకో సన్నాయి పలికించి.. రాలేటి పూలతో రాగాలు పలికించిన చరితార్ధుడు వేటూరి. ప్రియా ప్రియతమా అంటూ ఎప్పుడూ గుండెల్లో ధ్వనిస్తూనే ఉంటాడు.

ఆధునిక సినీకవిత్రయం ఎవరంటే ఆత్రేయ.. శ్రీశ్రీ.. వేటూరి.. అని చెప్పుకోవచ్చు. పద లాలిత్యంలోనూ.. భావ వైవిధ్యంలోనూ.. ముగ్గుర్లో ఎన్నో పోలికలు.. సామీప్యతలూ ఉన్నాయి. ముగ్గురి అవసానదశ దాదాపు ఒకే రకంగా గడచింది.

కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో

తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే

చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా

పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు.. అంటూ వేదాంతాన్ని ప్రేమని మానవత్వాన్ని రంగరించి రాగంలా మార్చిన వేటూరి చిరస్మరనీయుదు.

ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలోఒక పూటలొనె రాలు పూవులెన్నో అంటూ వేదాంతిలా వెళ్ళిపోయిన వేటూరి.. మనకు తన ఙ్ఞాపకాలు.. పాటలు.. మిగిల్చివెళ్ళారు. వెన్నెల్ని.. వేకువని.. వేటూరిని ఎలా మరిచిపోగలం..

(ఈ రోజు వేటూరి వర్థంతి సందర్భంగా)

Wednesday, May 11, 2011

రజినీకాంత్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?


ఇప్పుడు అందరి దృష్టి సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌పైనే. ఆయన ఆరోగ్యం ఇప్పటికీ అలాగే ఉందా? కొత్త సినిమా 'రాణా' షూటింగ్‌కు ఆయన ఆరోగ్యం అడ్డంకిగా మారిందా? అసలు ఇప్పట్లో రజినీ సినిమా లేనట్లేనా?

సూపర్‌స్టార్ రజనీకాంత్ అనారోగ్యం కారణంగా.. ఆయన కొత్త సినిమా రాణా చిక్కుల్లో పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రజనీ అనారోగ్యం కారణంగా రాణా మూవీ షూటింగ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగడం లేదు. కొద్ది రోజులు అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు రజినీ. అనారోగ్యం నుంచి రజనీ కోలుకుంటున్నప్పటికీ, షూటింగ్‌లో ఇప్పుడే పాల్గొనకూడదని డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు అతడిని అమెరికాలోని స్పెషలిస్ట్‌లకు డాక్టర్లు సూచించినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన రజినీ ఫ్యామిలీ డాక్టర్లతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
చికిత్సకోసం రజనీ త్వరలోనే అమెరికాకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఫలితంగా రాణా షెడ్యూల్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని యూనిట్ భావిస్తోంది.
ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన రాణా సినిమాలో రజనీ మూడు గెటప్పుల్లో నటిస్తున్నాడు. అందులో ఓ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. రోల్ చేయాలంటే ఎంతో ఫిజికల్ ఎనర్జీ కావాలి. ఈ నేపథ్యంలో ఆ పాత్ర చేసేందుకు రజినీ ఆరోగ్యం ఎంత వరకు సహకరిస్తుందనేది ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్న.


రాణా షూటింగ్‌ ప్రారంభమైన తొలి రోజే రజినీ అస్వస్థతకు గురయ్యాడు. కోలుకున్న కొద్ది రోజులకే మళ్లీ అదే పరిస్థితి. అసలు రాణా సినిమాకే రజినీ ఆరోగ్యం ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతోంది? అప్పుడు అందరికి వస్తున్న డౌట్‌ ఇదే. రజినీ చేస్తున్న మూడు గెటప్పుల్లో ఒకటి యువకుని పాత్ర. ఆ పాత్ర కోసం రజినీ ఏకంగా పదిహేను కిలోలు తగ్గాల్సి వచ్చిందట. 75 కిలోలు ఉన్న రజినీ 60 కిలోలకు చేరాడంట. ఇదే ఆయన ఆరోగ్యానికి అసలు కారణంగా తెలుస్తోంది.

మరి ఈ పరిణామాల నేపథ్యంలో రాణా షూటింగ్‌‌కు తాత్కలికంగా బ్రేక్‌ పడే అవకాశాలున్నాయని చెన్నై ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి. సూపర్‌స్టార్‌ త్వరగా కోలుకుని మరింతా ఉత్సాహంగా సినిమా పూర్తిచేయాలని ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు. 'రోబో' కంటే రాణాతో మరింతా తమను అలరిస్తాడని సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.



Friday, March 25, 2011

మళ్ళీ ఆపాత మధురాలు

సినిమా పాట చంద్రోదయాలు... చల్లని సాయంత్రాలు.. వెన్నెల కాంతులు... వసంత రాత్రులు... అన్నీ చూసింది. ఇక ఇప్పుడు రీమిక్స్‌. పాట పల్లవిని అలాగే వుంచి.. చరణాలను కొత్తగా మార్చి సరికొత్తగా కంపోజ్‌ చేయడం రివాజైంది. పాట మొత్తాన్ని యథాతథంగా దింపేసిన సందర్భాలూ వుంటున్నాయి. ఈ ట్రెండ్‌ను ఇటీవలి కాలంలో బాగా ఫాలోఅవుతున్న హీరో పవన్‌కళ్యాణ్‌‌. ఇటీవలే ఆడియో ఫంక్షన్‌ జరుపుకుని రిలీజ్‌కు రెడీ అవుతున్న పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ మూవీ తీన్‌మార్‌లోనూ రీమిక్స్‌ సాంగ్‌ ఉంది. ఓహోబస్తీ దొరసాని అలనాటి హిట్‌ సాంగ్‌ను మళ్ళీ గుర్తుకుతెచ్చింది.

1960లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన అభిమానం చిత్రంలోనిది ఈ పాట. ఘంటసాల-జిక్కి పాడిన ఈ పాటను ఆరుద్ర రాశారు.


పవన్‌కళ్యాణ్‌ మరో సినిమా ఖుషీలోనూ ఓ సాంగ్‌ను రీమిక్స్‌ చేశారు. పవన్‌కళ్యాణ్‌-భూమికపై చిత్రించిన ఆడువారి మాటలకు అర్థాలే అంటూ సాగే ఈ సాంగ్‌ జనాన్ని అలరించింది.

1955లో వచ్చిన ఎవర్‌గ్రీన్ సినిమా 'మిస్సమ్మ'లోనిది ఈ పాట. ఎన్టీయార్‌, సావిత్రి అభినయించిన ఈ పాత పాటను నెమరేసుకోని సంగీతాభిమానులుండరు. సాలూరి రాజేశ్వరరావు గొప్పతనమది.


పవన్‌కళ్యాణ్‌ రీమిక్స్‌ చేసిన మరో పాట తానే డైరెక్ట్‌ చేసిన జానీలోనిది. ఈ రేయితీయనిది అంటూ సాగుతుందీ పాట. ఈ పాట చిట్టిచెల్లెలు సినిమాలోని ఈ రేయి తీయనిది పాటను వాడుకున్నాడు.


భీమవరంబుల్లోడా పాలు కావాలా.. అంటూ ఇటీవలే వచ్చిన మూవీ రాజ్‌. సుమంత్‌, ప్రియమణి, విమలారామన్‌ కలిసి ఆడిపాడిన ఈ పాట మరోసారి ఆడియన్స్‌ను అలరించింది.

ఈ సాంగ్‌ ఘరానాబుల్లోడు నుంచి రీమీక్స్‌ చేసిన పాట. నాగార్జున-ఆమని స్టెప్పులేసిన ఈ పాట అప్పట్లో యూత్‌ను తెగ అట్రాక్ట్‌ చేసింది.


అల్లరి నరేష్‌ లేటెస్ట్‌ మూవీ ఆహా నా పెళ్ళంటలోనూ వచ్చిన రీమిక్స్‌ పాట అందరిని అలరిస్తోంది. ఈ సినిమాకి ఈ పాట హైలెట్‌గా నిలిచింది.

ఈ పాట 1982లో వచ్చిన జంధ్యాల సినిమానాలుగు స్తంబాలాటలోనిది. వేటూరి రాసిన ఈ పాటకు రాజన్‌-నాగేంద్ర మ్యూజిక్ అందించారు.


ఇలా అలనాటి హిట్‌ పాటలను రీమిక్స్‌ చేయడంతో సినిమాకు కూడా ప్లస్‌ పాయింట్‌ అవుతోంది. అందుకే కొత్త సినిమాలు ఆ సూత్రాన్ని పాటిస్తూనే వున్నాయి. ఏమైనా అలనాటి మధుర గీతాలను మళ్ళీ మనం ఆస్వాదిస్తూనే ఉన్నాము.





Friday, March 18, 2011

దాసరి.. కౌన్‌ బనేగా ముఖ్యమంత్రి


దాసరి నారాయణరావు మరోసారి బాలీవుడ్‌లో ఓ పొలిటికల్‌ మూవీని తెరకెక్కించబోతున్నాడు. 
సంజయ్‌దత్‌ హీరోగా కౌన్‌ బనేగా ముఖ్యమంత్రి పేరుతో హిందీలో సినిమా
చేయబోతున్నాడు దాసరి
.

పొలిటికల్‌ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు దాసరి నారాయణరావు.
సిల్వర్‌ స్ర్కీన్‌‌పై తాజా రాజకీయాల గురించి తనదైన శైలిలో సెటైర్లు విసురుతాయాన
.
తెలుగులోనే కాదు బాలీవుడ్‌లోనూ ఆయన ఓ పొలిటికల్‌ సినిమా రూపొందించారు
.
ఇరవై ఏడేళ్ళ క్రితం ఆజ్‌ కా ఎమ్మెల్యే టైటిల్‌తో రాజేష్‌ఖన్నాతో సినిమా తీశాడు దాసరి
.

తాజాగా దాసరి మరో పొలిటికల్‌ మూవీకి రెడీ అయ్యారు. ఈ సినిమా హిందీలో
తెరకెక్కించబోతున్నాడు
. సంజయ్‌దత్‌ హీరోగా కౌన్‌ బనేగా ముఖ్యమంత్రి పేరుతో ఈ సినిమాను
రూపొందించేందుకు ప్లాన్‌ జరుగుతున్నట్టు తెలుస్తోంది
. దాసరి మరోసారి పొలిటికల్‌ మూవీ రెడీ
అవుతుండటంతో ఇండస్ర్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది
.

Saturday, March 12, 2011

మార్లిన్‌ మాన్రోగా ఐశ్వర్యారాయ్‌

బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌ హాలీవుడ్‌ అద్భుతం మార్లిన్‌ మాన్రోగా కనిపించబోతోంది. హాలీవుడ్‌ సెన్సేషనల్‌ సెక్సీ స్టార్‌ మార్లిన్‌ లైఫ్‌స్టోరీని మధూర్‌ భండార్కర్‌ తెరకెక్కించనున్నారు.

సెక్సీయెస్ట్‌ ప్రపంచంలో మార్లిన్‌ మన్రో ఒక శృంగార సంచలన కెరటం. తన నగ్న సౌందర్యాన్ని సెల్యూలాయిడ్ మీద పరిచి వరల్డ్‌వైడ్‌గా ఆడియన్స్‌ అట్రాక్ట్ చేసింది. 'జెంటిల్ మెన్ ప్రెఫెర్ బ్లాన్దీస్', 'ది సెవన్ ఇయర్ ఇచ్', 'సం లైక్ ఇట్ హాట్' వంటి సినిమాలతో సిల్వర్‌స్ర్కీన్‌ను మరింతా అందంగా అలంకరించింది.


చూపుతిప్పుకోలేని అందమైన శృంగారాన్ని వెండితెర మీద ఒలకబోసి జనాన్ని మాయ చేసింది మార్లిన్ . కేవలం 36 ఏళ్ళు మాత్రమే జీవించిన మార్లిన్‌.. దశాబ్దాలకు సరిపడ పేరు సంపాదించింది. చనిపోయి నలభై ఏళ్లవుతున్నా మార్లిన్‌ అందం ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌.


రీల్‌ లైఫ్‌లోనే కాదు రియల్‌లైఫ్‌లోనూ మార్లిన్‌ది సెన్సేషనల్‌ స్టోరీ. తన జీవితంలో మూడు సార్లు పెళ్ళి చేసుకుని, అమెరికా అధ్యక్ష్యుడు జాన్.ఎఫ్.కెన్నడీతో నూ ఆయన సోదరుడుతోనూ ఒకే సారి ఎఫైర్స్ నడిపి హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికీ ఆమె ప్రణయగాధలు, శృంగార జీవితం, మరణం అన్నీ సంచలనాలే. అందుకే యధార్ధగాధలను తెరకెక్కించే దర్శకుడిగా పేరున్న మాధూర్‌ బండార్కర్‌ ... ఇప్పుడు మన్రో లైఫ్‌ను సిల్వర్‌స్ర్కీన్‌పై ఆవిష్కరించబోతున్నాడు.

అయితే మార్లిన్‌మన్రో పాత్ర కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్యరాయ్‌ని ఓకే చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఈ ప్రాజెక్ట్‌లో మార్లిన్ మన్రోగా కరీనా కపూర్ అయితే బాగుంటుందని అనుకున్నారు. అయితే ఆమె ఆసక్తి చూపకపోవటంతో ఆ ఆఫర్ ..ఐశ్వర్యని వరించినట్టు తెలుస్తోంది. మార్లిన్‌ను గుర్తుకు తెచ్చే రూపం ఉండటంతో ఈ పాత్రకు ఐష్‌ సరిగ్గా
సరిపోతుందంటున్నారు
.


ఐశ్వర్య అంటే మాధుర్‌ బండార్కర్‌కి ప్రత్యేమైన అభిమానం ఉంది. దీంతో ఐష్‌కు తగినట్టుగానే ఈ సినిమా స్టోరీ తయారు చేశారని అంటున్నారు. అయితే ఈ విషయం బయటికి రాకుండా ఐశ్వర్యరాయ్ ఈ చిత్రంలో నటించడానికి సైన్‌ చేసిందట. మార్లిన్ మన్రోకు భారీగా సెక్సీ స్టార్‌ ఇమేజ్ ఉంది. స్ర్కీన్‌పై మర్లిన్‌ స్థాయిలో శృంగారం ఒలికించడానికి ఈ నీలికళ్ళ సుందరి సుముఖంగానే ఉండటం బాలీవుడ్ జనాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

పేజ్ త్రీ, ఫ్యాషన్, చాందినీబార్ వంటి సినిమాలను రూపొందించిన మధూర్.. ఈ కొత్త సినిమాతో ఎటువంటి సంచలనం సృష్టించబోతున్నాడోనని సినీ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



తెహ్రీర్ నుంచి తెహ్రీర్ కు మళ్ళీ మళ్ళీ..

- ఒసామా హిజ్జి..


స్క్వేర్ ను చూసావా..

ప్రజలు ఎలా నిలబడ్డారో చూసావా..

జరిగింది మర్చిపోడానికి రక్తం ఎలా నిరాకరిస్తుందో చూసావా..

మతాలు ఒక్కటయ్యి..

ముస్లింలు.. క్రైస్తవులు కలిసి ప్రార్ధించడం చూసావా..

నియంతలపై విప్లవిస్తున్న చోట

నీకు శిలువలు కనబడవు..

నెలవంకలూ కనబడవు..

పూజారులు.. షేకుల నాటకీయ కౌగిలింతలూ కనబడవు..

మాతృభూమి కోసం ఏకమౌతున్న ఆత్మలు కనబడతాయి..

సమున్నతంగా ఎగురుతున్న పతాకాలు కనబడతాయి..

ఒకే దైవం.. ఒకే రక్తం.. ఒకే అస్థత్వాన్ని నమ్మే ఇద్దరు ఈజిప్షియన్లను చూస్తావు..

తిరుగుబాటును విశ్వాసంలో భాగంగా చూస్తావు..

మతమంటే విధేయంగా ఉండడం మాత్రమే కాదని చూస్తావు..

విప్లవం ఈజిప్ట్ వాసులను వీరులుగా తీర్చిదిద్దడం చూస్తావు..

భయం.. బందిపోట్లు.. భయపడడాన్ని చూస్తావు..

సల్లీ జహ్రాన్ కలలు గన్న ఈజిప్ట్ ను చూస్తావు..



(సల్లి నిరసన తెలపడానికి తెహ్రీర్ వెళుతుండగా సైన్యం చేసిన దాడిలో తలకు గాయమై మరణించింది. ఇది కవిత కాదు. బాధతో స్రవిస్తూ గుండెను పిండేస్తున్న పదాలు. ఈ పదాలు సల్లీ జహ్రాన్ ఆత్మకోసం అర్పిస్తున్న కానుక. మా దేహాల్లో ప్రాణమున్నంత వరకూ మాకు శాంతి లేదు. విశ్రాంతి లేదు. - ఒసామా హిజ్జి..)

(స్వేచ్ఛానువాదం: శక్తి)