Thursday, February 24, 2011

నింగికెగసిన సాహితీదిగ్గజం



దేవులపల్లి.. శ్రీశ్రీ.. ఆత్రేయల సరసన చేర్చదగిన మరో సినీ సాహితీ దిగ్గజం నింగికెగసింది. ముళ్ళపూడి వెంకటరమణ అనితరసాధ్యమైన సాహిత్యాన్ని మనకు మిగిల్చి వెళ్ళారు. బాపు రమణల జంటగా.. దేహాలు రెండు ఆత్మలు ఒకటిగా.. వెండితెరపై నవరసాలొలికించి తెలుగు ప్రేక్షకులను అలరించారు.


మడిసన్నాక కుసంత కళాపోసనుండాలి.. తిని తొంగుంటే మడిసికి గొడ్డుకూ తేడా ఏటుంటాది.. అంటూ గోదావరి జిల్లా ఎటకారంతో తెలుగు సినిమాకు కొత్త డిక్షన్ ఇచ్చిన సాహితీ సౌరభం. రక్తసంబంధం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ముళ్ళపూడి. మూగమనసులు.. దాగుడుమూతలు.. ప్రేమించి చూడా లాంటి సూపర్ హిట్ సినిమాలకు పనిచేసాక తన చిరకాల మిత్రుడు చిత్రకారుడు అయిన బాపును తెలుగు తెరకు దర్శకుడిగా సాక్షితో పరిచయంతో చేసాడు. ముళ్ళపూడి రాత.. బాబు గీత కలిసి నాస్తికత్వం.. ఆస్తికత్వం కలసిన మానవీయ చిత్రం బుద్ధిమంతుడుగా రూపొందింది.

పగలు-రాత్రి.. పడుగు-పేక.. ఆటు-పోటు..లా బాపు-రమణ.. కూడా తెలుగుభాషలో జంటపదాలై కూర్చున్నాయి. వారి స్నేహం.. అనుబంధం.. షష్టిపూర్తి కూడా చేసుకుంది. స్కూల్లో మొగ్గ తొడిగిన వారి స్నేహం.. పత్రికా రంగంలో పువ్వై విరిసింది. చలన చిత్రరంగంలో ఫలించింది. బాపురమణల జంట ప్రయాణం తర్వాత నిరాటంకంగా కొనసాగింది. బంగారు పిచుక.. బుద్ధిమంతుడు.. బాలరాజుకధ.. సంపూర్ణ రామాయణం.. హిట్లు.. ఫ్లాపులు.. ఏమైనా అవిచ్ఛన్నంగా నిండు గోదారిలా సాగింది.

ఆ దశలో పాపికొండల్లో గోదావరి ప్రయాణ నేపధ్యంగా అందాల రాముడు తీశారు. ఓ పిక్నిక్ లా సాగిన షూటింగ్ జరిగింది కాని ఫలితం చేదునే మిగిల్చింది. బాపు రమణలు వాళ్ళ మీదే వాళ్ళే కార్టూన్లు వేసుకునేలా చేసింది. సెకండ్ రిలీజ్ లో కాస్త పేరు సంపాదించి పెట్టినా ఫస్ట్ రిలీజ్ లో ఓ లాంచీలో సినిమా అంతా చుట్టేసాడ్రా అనే పేరు మాత్రం తీసుకొచ్చింది. ఆనాటి అందాల రాముడు ఈనాటి శేఖర్ కమ్ముల గోదావరికి ప్రేరణ కూడా.



బాపు రమణల మాగ్నం ఓపస్ అనదగిన సినిమా ముత్యాల ముగ్గు. ఓరంత కట్టపడిపోతన్నావేటిరా కొత్తపెళ్ళి కొడకా.. అంటూ వెటకారాలాడినా.. ఆ ముక్క నేను లెక్కెట్టుకో మునపే సెప్పాల... డిక్కీలో తోయించేగల్ను జగరత్త.. అంటూ చెంప పగలగొట్టి కళ్ళెర్ర చేసినా.. మర్డరు కెంత? మెడిసిను సీటుకెంత? కాలు చేయి తియ్యడానికెంత? మర్డరుకూ సీటుకూ ఎంత?కాలు చెయ్యితీయడానికీ, మెడిసిన్ సీటుకీ ఎంత? వోల్ మొత్తం మీత ఏమయినా కన్సెసను ఉంటుందా? .. సాక్షాత్తూ రావణాసురుడి లాంటి రావుగోపాలరావు మీదే సెటైర్లు వేయించినా రమణకే చెల్లింది.



అంత ఘనం కామెడి రాసిన కలమే.. వాడికి స్త్రీజాతిమీద నమ్మకం పోయింది.నాకు మనుషులమీదే నమ్మకంపోయింది.. అంటూ అద్భుతంగా కరుణరసం కూడా కురిపించింది. ముత్యాల ముగ్గు డైలాగులు ఎల్.పి.రికార్డులగా.. కాసెట్స్ గా.. ఎంత పాపులర్ అయ్యాయో ఆనాటి ప్రేక్షకులకు ఇంకా గుర్తుండే ఉంటాయి.



ముళ్ళపూడి వెంకటరమణ హాస్యాన్ని.. సెంటిమెంటునే కాదు భక్తిని కూడా అద్భుతంగా రాయగలడని రుజువు చేసిన చిత్రం భక్తకన్నప్ప. రమణ కరుణరసానికి మరో మంచి ఉదాహరణ భక్తకన్నప్ప. కృష్ణంరాజుని గిరిజనుడిగా.. శివభక్తుడిగా.. రెండు పాత్రలలోని వేరియేషన్ని తన రచనలో గొప్పగా చిత్రించాడు రమణ. అంత గొప్పగా చిత్రీకరించాడు బాపు.



బాపు రమణల కాంబినేషన్లో మరో సెన్సేషనల్ సినిమా మన ఊరి పాండవులు. మహాభారతాన్ని లోకలైజ్ చేస్తూ రాసిన మరో సెటైర్ ఈ చిత్రం. ఇటు కృష్ణంరాజు డైలాగులు.. అటు రావుగోపాలరావు డైలాగులు.. తెలుగు దేశాన్ని ఉర్రూతలూగించాయి.



ఆ తర్వాత చిరంజీవితో మంత్రిగారి వియ్యంకుడు రమణ కలం చిందులు తొక్కింది. కాయ్ కాయ్ కొబ్బరి కాయ్.. అంటూ రమణ రాసిన టీజింగ్ సీన్స్ రక్తి కట్టించాయి. బాపు తీత.. రమణ రాత.. చిరంజీవి కెరీర్ కు ఆరోజుల్లో ఎంతో ఉపయోగపడింది.



భార్యా భర్తల మధ్య తియ్యని రాజీలు.. అనుమానం నుంచి అర్ధం చేసుకోడాలు. అర్ధం చేసుకోడం నుంచి సౌఖ్యాలు.. సౌఖ్యం నుంచి సంతోషాలు.. సంతోషం నుంచి స్వార్ధం.. స్వార్ధం నుంచి మళ్ళీ అనుమానాలు.. ఇలా అంతులేని వలయంగా తిరిగే మొగుడు పెళ్ళాల గోలను జనరంజకంగా రచించాడు రమణ. స్వీట్ నథింగ్స్ ను స్వీట్ సంథింగ్స్ గా అద్భుతంగా మలచిన బాపు రమణల కాంబినేషన్ అరవైలో ఇరవైగా మారి తీసిన సినిమా ఇది.



భార్య భర్తల మధ్య సంబంధాలను మరో కోణం నుంచి సృశించిన సబ్జెక్ట్ మిస్టర్ పెళ్ళాం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే వాదం నుంచి పుట్టిన వివాదానికి రమణ అద్దిన పదాల సొబగులు సినిమాను అందంగా తీర్చిదిద్దాయి. రాధాగోపాలం కూడా ఓ రకంగా భార్యాభర్తల వాదాలు వివాదాలతో రూపొందిన సినిమానే. బాపు-రమణల సృష్టి పాత సీసాలో పాత సారాగా అనిపించింది. అంతగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత వచ్చిన సుందరకాండది అదే పరిస్థితి.



బాపు రమణల చివరిచిత్రం శ్రీరామరాజ్యం. బాలకృష్ణ రాముడిగా నటిస్తున్న ఈ చిత్రం బాపు రమణల అరవై ఏళ్ళ స్నేహానికి చివరి గుర్తుగా మిగలబోతుంది. రమణలేని బాపును రాత లేన గీతగా ఊహించుకోడం మనకే కాదు ఆయనకు కూడా కష్టమే. సీగానపెసూనాంబ లేని బుడుగులా.. సీత జాడ తెలియని రాముడిలా.. రెండుజెళ్ళసీత లేని గోపాలంటా.. బాపు ఇక ఒంటరి వాడు. ముళ్ళపూడి ఆకస్మిక మృతికి నివాళులర్పిద్దాం..

No comments:

Post a Comment