Saturday, March 7, 2015

సంచలనం రేపుతున్న 'ఇండియాస్ డాటర్'


దేశంలో నిత్యం ఏదో ఒక మూల పసికందులు సైతం కామాంధుల చేతిలో బలైపోతున్న విషపూరిత సమాజంలో.. లెస్లీ ఉడ్విన్ తీసిన ఇండియాస్ డాటర్ ఇప్పుడొక సంచలనం! దేశాన్ని నివ్వెరపర్చిన నిర్భయ ఉదంతంపై బీబీసీ మహిళా రిపోర్టర్ రూపొందించిన డాక్యుమెంటరీ ఒక చర్చగా విప్లవం సృష్టిస్తున్నది. ఒక ఆత్మ పరిశీలనకు ఆస్కారం కల్పిస్తున్నది. వ్యవస్థపై ఆగ్రహం రేకెత్తిస్తున్నది.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో... సాయం సమయం! నిర్భయ ఉదంతాన్ని వివరిస్తూ ‘ఇండియాస్‌ డాటర్‌’ డాక్యుమెంటరీ మొదలవుతుంది. నిర్భయ ఘటన దేశం మొత్తాన్ని ఎలా కదిలించిందో... నాటి ఆందోళనలను, రాష్ట్రపతి భవన్‌ ముట్టడి, అక్కడ జరిగిన లాఠీచార్జీ, నీటిఫిరంగుల ప్రయోగం కనిపిస్తుంది. ఆ తర్వాత... ‘ఇండియాస్‌ డాటర్‌’ టైటిల్‌! కనిపిస్తుంది. ఆ వెంటనే... నిర్భయ తల్లిదండ్రులతో ఇంటర్వ్యూ! ఫొటో ఆల్బమ్‌ తిరగేస్తూ... నిర్భయ చిన్ననాటి జ్ఞాపకాలను వారు వివరిస్తారు. చదువుపై నిర్భయ ఆసక్తి గురించి ఆమె స్నేహితుడు, ట్యూటర్‌ సతేంద్ర చెబుతారు. ఆ తర్వాత... నిర్భయ అత్యాచార కేసులో ఉరితీత ఖైదీ, డ్రైవర్‌ ముకేశ్‌ తెరమీదికి వస్తాడు. చేసింది పిచ్చిపని... ఇప్పటికీ అవే పిచ్చి ప్రేలాపనలు, పనికిరాని లాజిక్‌లు! ఇంకా... డిఫెన్స్‌ లాయర్లు ఎంఎల్‌ శర్మ, ఏపీసింగ్‌దీ అదే తీరు. ఇతర దోషులు రామ్‌సింగ్‌ (ముకేశ్‌ సోదరుడు... జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు), వినయ్‌, పవన్‌, అక్షయ్‌తోపాటు మూడేళ్ల శిక్షతో తప్పించుకున్న 17 ఏళ్ల ‘బాలుడు’ గురించి కూడా వివరిస్తాడు. డాక్యుమెంటరీలో ఎక్కువభాగం కనిపించేది, వినిపించేది ముఖేశ్‌, నిర్భయ తల్లిదండ్రులే. రామ్‌సింగ్‌ తదితరుల దోషుల నివాసాలను కూడా డాక్యుమెంటరీలో చూపించారు. దాదాపు దోషులందరు కుటుంబ సభ్యులూ మాట్లాడారు. అందరి ముఖాల్లోనూ విషాదం, దారిద్య్రం తాండవిస్తున్నాయి. ఇదే డాక్యుమెంటరీలో... మాజీ న్యాయమూర్తి లీలా సేథ్‌, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ చరిత్రకారిణి ఆక్స్‌ఫర్డ్‌ మరియా మిశ్రా, తీహార్‌ జైలు సైక్రియాటిస్ట్‌ సందీప్‌ గోవిల్‌ తదితరుల అభిప్రాయాలూ ఈ డాక్యుమెంటరీలో వినిపిస్తాయి. రోడ్డు పక్కన అసహాయంగా పడిన నిర్భయ, ఆమె స్నేహితులను మొట్టమొదట చూసిన కానిస్టేబుల్‌ రాజ్‌కుమార్‌ నాటి ఘటన గురించి వివరించారు. పీసీఆర్‌ వ్యాన్‌ వచ్చేదాకా... ఎవ్వరూ తనకు సహకరించలేదని, సహాయం చేయాల్సిందిగా కోరినా స్పందించలేదని రాజ్‌కుమార్‌ తెలిపారు. నిర్భయపై ఎంత దారుణంగా అత్యాచారం జరిగిందీ, ఆమెను ఎంత తీవ్రంగా గాయపరిచిందీ సఫ్దర్‌గంజ్‌ ఆస్పత్రికి చెందిన వైద్యురాలు రష్మీ అహూజా వివరించారు. ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు ఆమె శరీరంలో ఏ భాగం ఎక్కడుందో తెలుసుకునేందుకు తాము ఎంతో కష్టపడ్డామని చెప్పారు. ఈ కేసు దర్యాప్తు, నిందితుల అరెస్టు, చార్జిషీట్‌ దాఖలు, ఇతర అంశాలను అడిషనల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుష్వాహ, ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ ప్రతిభా శర్మ వివరించారు. సామాజిక కార్యకర్త కవితా కృష్ణన్‌ (మహిళా కార్యకర్త), గోపాల్‌ సుబ్రమణ్యం (న్యాయ నిపుణుడు, వర్మ కమిటీ నివేదిక సహ రచయిత), ఆమోద్‌ కాంత్‌ (స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి) తదితరులు తమ అభిప్రాయాలు తెలిపారు. ‘సింగపూర్‌కు వెళ్లిన నిర్భయ తిరిగి క్షేమంగా రావాలని ప్రార్థిస్తున్నాం’ అంటూ సోనియా గాంధీ చేసిన ప్రకటననూ డాక్యుమెంటరీలో భాగంగా చూపించారు. ఇక... అప్పట్లో ఢిల్లీ సీఎంగా ఉన్న షీలా దీక్షిత్‌ కూడా ఈ ఘటనపై స్పందించారు. ‘నిర్భయ’ ఘటన ఈ దేశాన్ని కదిలించిన తీరు, ప్రజలు తమ ఆందోళనలతో ప్రభుత్వాలను కదిలించిన వైనాన్ని డాక్యుమెంటరీలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజాందోళనలకు పెద్దపీట వేశారు. అప్పట్లో ఈ ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న మహిళలతో మాట్లాడారు. మొత్తం మీద 2012 డిసెంబర్‌ 16న జరిగిన దారుణాన్ని ‘ఇండియాస్‌ డాటర్‌’ కళ్లకు కట్టింది. పేరులో ‘ఇండియా’ ఉన్నా చిత్రం ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా నిత్యం అత్యాచారాలకు గురవుతున్న మహిళల గణాంకాలను వివరించడం ద్వారా ఈ సమస్య ఒక్క ఇండియాకే పరిమితం కాదని చెబుతారు దర్శకురాలు.

నిషేధం అవాంఛనీయం
ఇండియాస్‌ డాటర్‌పై కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన ఎడిటర్స్‌ గిల్డ్‌
న్యూఢిల్లీ: ‘ఇండియాస్‌ డాటర్‌’పై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎడిటర్స్‌ గిల్డ్‌ తప్పుపట్టింది. ఇది అవాంఛనీయ పరిణామమని, తక్షణం నిషేధాన్ని తొలగించాలని డిమాండ్‌ చేసింది. ఈ చిత్రం అందించే సందేశాన్ని అర్థం చేసుకోవడంలో పాలకులు అపోహకు లోనయ్యారని వ్యాఖ్యానించింది. తమ చుట్టుపక్కల ఉండే మనుషల ఆలోచనలు ఏవిధంగా ఉంటాయో ప్రతిఒక్కరికీ అవగతమయ్యేలా ఈ చిత్రం ఉందని, ప్రతి మనిషీ తన ఆలోచనలను పునఃసమీక్షించుకునేలా చేయగల శక్తి ఈ చిత్రానికి ఉందని అభిప్రాయపడింది. మరోవైపు చిత్ర దర్శకురాలు లెస్లీ ఉడ్‌విన్‌ను అనుమతించే విషయంలో తీహార్‌ జైలు అధికారులు గతంలో తాము విధించుకున్న నిబంధనలను తామే ఉల్లంఘించినట్లు హోంశాఖ గుర్తించింది. జైలు సందర్శనకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకునే విదేశీయుల పూర్వాపరాలను పక్కాగా పరిశీలించాలని, ముఖ్యంగా ప్రసారమాధ్యమాలతో సంబంధం ఉన్న వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిబంధనలున్నా, లెస్లీ విషయంలో మాత్రం దీన్ని బేఖాతర్‌ చేశారనికేంద్ర హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇంటర్వ్యూ సమయంలో ముఖేష్‌ సాధారణ దుస్తుల్లో ఉండటమూ నిబంధనల ఉల్లంఘనే అని ఆయన పేర్కొన్నారు. దీనికి బాధ్యులను గుర్తించే పనిలో హోంశాఖ నిమగ్నమైంది.

నోరు విప్పాలంటే 2 లక్షలు ఇవ్వాలి!
నిర్భయ నిందితుడు ముఖేష్‌ డిమాండ్‌
నిర్భయ గ్యాంగ్‌రేప్‌ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ముఖే్‌షసింగ్‌ను ఇంటర్వ్యూ చేసినందుకు ఇండియాస్‌ డాటర్‌ దర్శకనిర్మాతలు అతనికి రూ.40వేలు చెల్లించినట్లు విశ్వసనీయ సమాచారం. దర్శకురాలు లెస్లీ ఉడ్‌విన్‌ ముఖే్‌షని ఇంటర్వ్యూ చేసేందుకు కేంద్ర హోంశాఖ, తీహార్‌ జైలు అధికారుల అనుమతిని సునాయాసంగానే సాధించారు. అయితే, ముఖే్‌షతో మాట్లాడించేందుకు ఆమె కొద్దిగా కష్టపడాల్సి వచ్చింది. ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ముఖేష్‌ వారిని రూ.2 లక్షలు డిమాండ్‌ చేశాడు. దీంతో కంగుతిన్న దర్శకనిర్మాతలు అతనితో బేరాలు మొదలుపెట్టారు. చివరకు రూ.40వేలకు ఒప్పందం కుదిరింది.
https://www.youtube.com/watch?v=HjNT8fiZ6Nw

No comments:

Post a Comment