Friday, March 11, 2011

తప్పు ఎవరిది? ఎందుకు జరిగింది?

అనుకున్నంతా.. ఆందోళన చెందినంతా జరిగింది. నిజమే ట్యాంక్ బండ్‌పై జరిగిన ఘటనలు దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు హర్షించదగినవి కావు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఉన్న పవిత్రతను ప్రశ్నించే అవకాశం ఈ ఘటన. నలుగురిలో నవ్వుతున్న సీమాంధ్రులకు తెలంగాణ ఉద్యమంపై దూషణలు చేయడానికి తగిన ఆయుధం కల్పించిన పరిస్థితి.

కానీ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలో.. భారతవనిలో మునుపెన్నడూ జరగని దురదృష్టకర ఘటననా? ఈ ప్రజాస్వామ్యంలో దాడులు మునుపెన్నడూ జరగనివా? నిజంగా మిలియన్ మార్చ్‌లో ఆందోళకారులు అంతటి పాపానికి ఒడిగట్టారా? .. ఈ ప్రశ్నలు అడగడంతో నేను దాడులను సమర్థిస్తున్నానని కాదు.. ముందే ఒక అభిప్రాయంలో ఉన్నవారికి ఎంతటి విశ్లేషణ ఇచ్చినా నిష్ప్రయోజనం కదా..

ఈ ఘటన జరగడానికి టీఆర్‌ఎస్‌లోని ఓ వర్గం మంకుతనమే కావొచ్చు. తమ మాటను లెక్కచేయకుండా మార్చ్ నిర్వహించడం.. వారి అహం దెబ్బతినొచ్చు. మేము లేకపోతే ఉద్యమం నడిపించలేరనే అభిప్రాయం కల్పించాలనుకున్నారేమో.. దాడుల పల్లవితో విమర్శలు చేస్తోన్న గద్దర్‌ను మార్చ్‌లో లాగడం ద్వారా రెండు పిట్టలు కొట్టాలనుకున్నా టీఆర్‌ఎస్‌లోని ఓ వర్గం సక్సెస్ అయిందని నా అనుమానం. ఇది నిజం కావొచ్చు.. కాకపోవచ్చు..

మొత్తం ఘటనకు దోషులు ప్రభుత్వం, రాజకీయ పార్టీలే.. ప్రజాస్వామ్యం, దారుణం అంటూ ఘోషించేవారు కాస్తా వెనుదిరిగి చూస్తే ఎంతో కొంత వాస్తవం తెలుస్తుంది. ప్రభుత్వం కాబట్టి ఏమైనా చేయొచ్చు.. ఉద్యమకారులు అలా చేయొద్దు అనుకునే ఆలోచనలో ఉన్నవారు.. కొద్దిగానైనా ప్రజాస్వామ్యం గురించి తెలుసుకుంటారు.

ఒకప్పుడు అన్నల సానూభూతి పరులనే నెపంతో ఎంతటి చిత్రహింసలకు గురిచేసేవారో.. ప్రస్తుతం తెలంగాణలో ప్రజలు పోలీసుల హింసకు బలైతున్నారు. వారి ఆంక్షలకు మనో వేదన చెందుతున్నారు. సమస్యను పరిష్కరిచాలనో, అర్థం చేసుకుందామనో అభిప్రాయం లేని ప్రభుత్వాలు పోలీసులకు అధికారాలను అప్పచెబుతాయి. విగ్రహాలపై దాడులు దారుణమంటున్న అధికార, ప్రతిపక్ష సీమాంధ్ర నేతలకు.. ఒక్కడ్ని చేసి పదిమంది పోలీసులు విద్యార్థిని చితకబాదిన సంఘటనలు వారి కళ్లకు కనపడలేదా.. వారి ఆక్రంధనలు చెవికి ఎక్కలేదా.. చరిత్ర అంటే పుస్తకాల్లో, కట్టడాలపై నిక్షిప్తం చేసుకున్న ఉదహరణలు కావు.. చరిత్ర అంటే ప్రజలే... వర్తమాన ప్రజలు ముఖ్యం కానప్పుడు.. గత చరిత్ర ఎందుకు? చరిత్రను మోసేది.. మోసుకేళ్లేది ప్రజలే... ఆ ప్రజలే ఆకాంక్షల ముందు.. చరిత్ర ఎక్కువనుకుంటే ఆ చరిత్రను బహిష్కరించగలరు... ధ్వంసం చేయగలరు.. తెలంగాణ ఉద్యమానికి కారణాల్లో ఒకటి చరిత్ర-సంస్కృతిపై దాడులు.. తమ సంస్కృతిపై అవహేళన, చరిత్రపై విధ్వంసాన్ని జీర్ణించుకోలేక కుమిలిపోతున్న పరిస్థితి కొనసాగుతూనే ఉంది. దానిపై ఎన్నడూ మాట్లాడని వారికి ఇప్పుడు చరిత్రపై దాడులు గురించి ప్రశ్నించే అర్హత లేదని ఆక్రోశం ఇప్పుడు ఉంది. అది విగ్రహాల తప్పు కాదు. కాని విగ్రహాలకు ప్రతినిధుల తప్పే కదా.. ట్యాంక్ బండ్‌పై తమ ప్రాంత మహానుభావుల్లో కొందరివే ఉన్నాయే ప్రశ్నకు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సమాధానం లేదు, ఆ ప్రశ్నలు తిరిగి రాకుండా చర్యలు చేపట్టలేదు. ఇప్పటి ఘటన జరిగేందుకు కారణాల్లో ఇది ఒకటి కాదా?. రాజకీయ సమస్యను ప్రజల సమస్యగా మారేలా ముసుగు తన్ని పడుకున్న ప్రభుత్వాలది కాదా?. నిజానికి విగ్రహాలు ధ్వంసం చేసిన వారు.. కావాలని చేసిన దుండగులు కావొచ్చు.. ఆవేదనతో చేసిన తెలంగాణ వాదులు కావొచ్చు.. ఒకటి మాత్రం స్పష్టం... వారిని ఇందుకు పురిగొల్పిన పరిస్థితులు సృష్టించిన ప్రభుత్వాలది, విధాన నిర్ణయాలు తీసుకోలేని పార్టీల నేతలే అసలు దోషులు. విగ్రహాలపై దాడులు చేసిన వారికి త్రిపురనేని ఏ సేవ చేశాడో తెలియదు, ఎర్రాప్రగడ ఏ పర్వం రాశాడో తెలియదు, శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలెవరో తెలియదు. కానీ ప్రభుత్వాలు, పార్టీలు ఇప్పటి పరిస్థితులు ఊహించక పోవడం క్షమించరాని నేరం. అసలీ విషయాలు తెలిసీ తెలియనట్టుగా ప్రవర్తించడమే దారుణం.

తరుచూ నేతలపై దాడులు జరుగుతుండడం ప్రజల్లో ఉన్న ఆగ్రహవేశాలేనని నిజం తెలసుకున్న ప్రజా ప్రతినిధులు ఆ దాడులు మరో ప్రాంతంపై జరగకుండా నివారించే ఆలోచనలు చేయగలుగుతున్నారా? తాము ఎన్నుకున్న నేతలు తమ అభిప్రాయలకనుగుణంగా లేకపోవడం దాడులకు పురిగొల్పేలా చేస్తున్నాయి.

మీడియాపై దాడి... అప్రజాస్వామికం, విద్రోహం అనే వారు.. అదే మీడియాపై ప్రభుత్వం దాడులు చేస్తే ఏం చేశారు? అ సంఘాలు ఏం చేశాయి? గిరిగీసుకుని వార్తలు ప్రసారం చేస్తున్న సంస్థలకు నైతికత గురించి అర్హత ఉందా? పైకి మంచి ముసుగు వేసుకుని వెనకాల రాజకీయ నేతలతో ములఖత్ అవుతోన్న మీడియాకు.. ఆనేతలకు తేడా ఏముంది? తమ అభిప్రాయాలు, ఆక్రంధనలు ప్రసారం చేయలేని మీడియా ఆగ్రహాలను మాత్రమే చూపించడంపై ఆందోళనకారులు తమ ప్రతాపం చూపారు. పరికరాలు పోయాయని పెడబొబ్బలు పెట్టడం.. గొరంతను కొండంత చేస్తున్న మీడియాకు అలాంటి పరికరాలు పొందడం పెద్ద సమస్యా?. మీడియా నిష్పక్షపాతంగా లేకపోవడమే వారికి కష్టాలు తెచ్చిపెడుతోంది. మీడియాను ప్రజలు ఎంతో కొంత ఆదరిస్తున్నారంటే.. మీడియా వల్లే తమకేదో ఇంకా మంచి జరుగుందనే.. కానీ ఆ మంచి జరగదని తెలిస్తే మీడియాకు ఆ విలువ ఉండదు.. వారిపై ఇలాంటి దాడులు ఆగవు. అందుకు తప్పు పట్టాల్సింది ఎవరిని?

ఎన్నైనా చెప్పు చేసింది తప్పు కాదా.. అంటే తప్పు కాదని ఎవరూ అనరు. కానీ అందుకు దారి తీయాల్సిన పరిస్థితులు విశ్లేషించి అసలు దోషులకు శిక్షపడాలి. అలా జరగడం లేదు.. ఇదే విచారకరం.. ప్రభుత్వం పంతానికి పోకుండా పరీక్షను వాయిదా వేసినా.. మార్చ్‌కు అనుమతిచ్చినా.. అడుగడుగునా ఆంక్షలు, అక్రమ కేసులు పెట్టకపోయినా.. నేతలను అరెస్ట్ చేసిఉండకపోయినా దాడుల తీవ్రత తగ్గిఉండేది. ఇలాంటి పరిస్థితులు రాకుండా చేయగలిగేది, వస్తే పరిష్కరించగలిగేవి ప్రభుత్వాలు, ప్రతిపక్షాలే.. కాని దురదృష్టమేమిటంటే ఇక్కడ సమస్యలకు అసలు కారకులు వారే.. ఇక దోషులు ఎవరు.. నిందితులు ఎవరు.. శిక్షించేదెవరు.. తప్పును ప్రశ్నించేదెవరు...

సంపత్















2 comments:

  1. హుస్సేన్సాగర్ మీది విగ్రహాలు మీవి ,అందులే తేలే శవాలన్నీ మావా ?అన్న కవి ప్రశ్న ఉదయించి పదేండ్లు అయ్యింది. మరి ఆ వాక్కు వట్టిగనే పొతదా?మహనీయుల విగ్రహాల మీద ఎవలకు రెండో రకం అభిప్రాయం లేదు. అవి పెట్టిచిన వాళ్ళ మీదనే మంట. ఇది సమైక్య రాష్ట్రమే అయితే హుస్సేన్సాగర్ కట్ట మీద మూడో నాలుగో విగ్రహాలు తెలంగాణ మహానీయులయి ఎందుకుంటాయి? తక్కిన ఇరువై ముప్పై అంద్రాయి ఎందుకుంటాయి. మాకు బందగి,ఇలమ్మ షోయబుల్ల ఖాన్, తుర్రెబాజ్ ఖాన్ బద్దం ఎల్ల రెడ్డి, వట్టికోట ఆళ్వారు స్వామి, దాశరథి, పాల్కురికి సోమన్న, కాలోజి, కొమురం భీమ్ ఇంకా ఎందరో ఉన్నారు వాళ్ళ విగ్రహాలు ఎక్కడ పెట్టరు. పోనీ ఆంద్ర ప్రాంతం లో ఎక్కడన్నా తెలంగాణ విగ్రహాలు ఉన్నాయా? విశాఖ బీచ్ దగ్గర ఉన్న విగ్రహాలలో ఒక్కటైనా ఉన్నదా? అగో అందుకే ఎక్కన్నో కాల్సుక వస్తది. కోపం రేశం వస్తది. విగ్రహ ఆగ్రహం వస్తది. నిజానికి తెలంగాణ ప్రజలకు ఎంత వోపిక ఉన్నదంటే తమ తమ పట్టణాల్లో ఉన్న తెలంగాణ వ్యతిరేకుల విగ్రహాలను ఇంకా ముట్టుకుంట లేరు.

    ReplyDelete
  2. వి'గ్రహాల' విద్వంసం!
    జాతి రత్నాలు అంటున్నావ్, ఎవడి జాతి..
    బొమ్మలు తగలబడితేనే నీకు చరిత్ర, సంస్కృతీ గురుతోచ్చిందా..
    అసలు నీకు 'ఆత్మ' ' గౌరవం' అంటే అర్థాలు తెలుసా..
    కూలిన నీ చరిత్ర కారులని అడిగి తెలుసుకో బ్రదర్
    తెలుగు జాతి తగల బడింది అని కుల్లుతున్నావ్
    తెలంగాణా జాతి మాటేప్పుడైనా వినపడిందా

    వారు గొప్ప వారు కావొచ్చు..
    కాని నా తల్లి గుండె మీద
    నిప్పులై మండుతున్నారు
    ఎపుడైనా నీ ఎసి కార్లల్ల తిరుగుతుంటే
    కనపడిందా మా గోస

    హుస్సేన్ సాగర్ నిండా నా తల్లి కంటి నీరే కదా..
    భాషని, యాసని హేళన చేసి చూసే నీకు
    ఎక్కడిదిరా హక్కు
    జాతి గురించి ఊసెత్తడానికి

    అందమైన హైదరాబాద్ ను తయారు చేసిన
    నా రాజుల చరిత్ర ఏది?
    ప్రపంచ పటంల నా జాతి ని నిలబెట్టిన
    నా నిజాం పరిమళాలు కలుషితం చేసి
    మా కొమరం భీమ్ ధైర్యానికి , వీర చరిత్రకు మసి పూసి,
    అయిలవ్వను , యాదగిరిని , బందగిని బొందపెట్టి
    ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నావ్..

    రాయి బద్దలయితే రాద్ధాంతం చేస్తున్నావ్,
    బొమ్మ పగిలితే గుండె పగిలినట్టు
    గంటలూ గంటలూ రొద పెడుతున్నావ్
    నువ్వు నిలబడ్డ జాగా నాది,
    నా జాగా చరిత్ర ఏది? సంస్కృతీ ఏది?

    నా బిడ్డలు ఏరి..
    ఓ గురజాడా, ఎర్ర ప్రగడ, ఇంకా ప్రజా కవులారా..
    మీరు చేసిన తప్పంతా..
    రక్త మాంసాలు తినే నర రూప రాక్షసుల చేతుల్లో పడడమే,
    మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మా జాతి ని మట్టు బెట్టి,
    మా చరిత్ర సమాధుల మీద మిమ్మల్ని నిలబెట్టడమే

    మేము గురి పెట్టింది మిమ్మల్ని కాక పోవచ్చు,
    మీరు చేసిన కృషిని కాకపోవచ్చు..
    మా ఆక్రోశం బద్దలు అయింది
    భాల్ల్లున పగిలింది మీ బొమ్మల పైన..

    మీ జాగా ఖాళి అయితేనే కదా
    మా చరిత్రలు నిలబడేది

    ఒకటి అంతం అయితేనే మరొకటి మొదలు..
    మా జాతి కోసం ప్రాణాలు అర్పించిన
    అమర వీరుల సమాధులకు కూడ
    జాగా లేదు, వారికి చోటియ్యనియండి,
    బొమ్మలకి బాద పడే మీరు..
    బిడ్డలు కళ్ళముందు కాలుతుంటే
    ఒక్క కన్నీటి బొట్టు కూడ రాల్చ లేదే?
    కవితలు రాల లేదే, పుస్తకాలు అచ్చు కాలేదే ?

    మీ మాటలు కత్తుల్ల దిగుతుంటే
    ముక్కలైన మా మట్టిని ,
    బూడిదైన మా సంస్కృతిని
    మళ్లీ నిలబెట్టుకున్దామనే
    చరిత్రని మల్లా తిరగ రాస్తున్నాం,

    ఇక్కడ మీకు , మీ గొప్ప చరిత్రలకు
    స్తానం లేదు..అందమైన విగ్రహాలకు
    విడిది కాదు నా ఇల్లు,
    ఆగమైతున్న బతుకు చిత్రాలకు
    కొలువు..

    భుతల్లి కన్నీట మునుగుతున్నాం
    గర్భ శోకంతో కుంగి పోతున్నాం..
    మోసాలకు ఎత్తులకు జిత్తులకు
    విసిగి వేసారి ఉన్నాం..
    కొలిమిల్లాగా మండుతున్నాం..
    దగ్గర కొస్తే ఆగం అయితారు..

    మాట్లాడే సహనం లేదు,
    బ్రతిమిలాడే క్వాయిష్ అంత కన్న లేదు
    మిగిలినవి చేతలు , చేతులే ..
    ఆవేశం అంటుకున్నది
    ఆవేదన అలుముకున్టున్నది..
    మంచి చెడుల మధ్య
    చెరిగిన రేఖ..
    న్యాయ అన్యాయాల మధ్య నలిగిన
    సత్యం..

    ఇప్పటికైనా ...
    నా భూమ్మీద నా బిడ్డలకే హక్కు..
    మేమూ ప్రజా కవులను ప్రేమిస్తాం..
    మీ చరిత్రనూ నిలబెడతాం..
    మా చేతుల మీదుగా
    మేము ప్రశాంతంగా
    స్వేచ్చగా గాలి పిలచిన రోజు..


    ...సుజాత సూరేపల్లి
    http://nanokiran.blogspot.com/2011/03/blog-post_4586.html

    ReplyDelete