Saturday, December 25, 2010

మీ కలల్ని నిజం చేసుకోండి..

*సక్సెస్ స్టోరీ

-
ఆమె కళ్లల్లో ఆత్మస్థైర్యం.. ఏ సమస్యనైనా ఎదుర్కొనగలమన్న ధీమా - ఈ సమాజానికి ఏదో చేయాలన్న తపన.. తోటి మహిళలు సైతం విజయాల్ని సాధించాలి.. పురుషాధిక్య జగత్తుకి గుణపాఠం చెప్పాలి.. గాంధీజీ కలలుగన్న మహిళా స్వేచ్ఛకి పునాదులు వేయాలి. ప్రగతిపథంలో ఎన్ని మెట్లు ఎక్కినా.. అధఃపాతాళానికి తోసేసే మగాడి దాష్ఠీకాన్ని కూకటి వేళ్లతో పెళ్లగించాలి - ఇదీ ఆమె ఆలోచన. పదేళ్లుగా ఆమె పోరాటం నిరంతరంగా సాగిపోతూనే ఉంది. ఆమె - గ్రోత్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్. ఐఎస్‌ఒ 9001 : 2000 గుర్తింపు పొందిన కౌనె్సలింగ్ ఫార్మ్ అధినేత. ఈ సంస్థ ద్వారా వొకేషనల్ గైడెన్స్, పర్సనల్ కౌనె్సలింగ్, కౌనె్సలింగ్ అండ్ కోచింగ్ ఫర్ ఎడ్యుకేషన్ ఎబ్రాడ్, కెరీర్ సెమినార్లు నిర్వహించటం.. వర్క్‌షాప్‌ల పర్యవేక్షణ - ఇదీ ఆమె జీవితం. సుదీర్ఘ కౌనె్సలింగ్ అనుభవంతో ఎంతోమంది మహిళలకు చుక్కాని అయిందామె. ఈ సంస్థ మహరాష్ట్ర ఎకనమిక్ డెవలప్‌మెంట్ కౌనె్సల్ (ఎంఇడిసి)లో ఒక భాగం. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, టైమ్ మేనేజ్‌మెంట్, రోల్ ఎఫెక్టివ్‌నెస్.. ఇలా పలు అంశాలపై ఆమె వర్క్‌షాప్స్ నిర్వహించటమే కాదు.. కౌనె్సలింగ్‌కి సంబంధించి సూచనలు సలహాలను అందిస్తారు. ఆమే స్వాతి సలంఖీ.
యువత కలల లోకాన్ని సృష్టించటమే కాదు.. ఆ కలల్ని నిజం చేసుకునే చేయూత నందిస్తారు. అమ్మాయిలకు ఎన్నో ఆశలుంటాయి. అవి నెరవేరే అవకాశాలుండవు. అటువంటప్పుడు ఏ దిశగా పయనిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చో అందమైన మాటల్లో చెప్తారు. అవేమిటో ఆమె మాటల్లోనే చూద్దాం. అమ్మాయిలు తమ భవిష్య ప్రణాళిక అనేది తొమ్మిదో తరగతి నుంచీ నిర్ణయించుకోవటం మంచిది. అప్పటికి చదువుల బాదరాబందీ అంతగా ఉండదు. రేపటికి నేనేం చేయాలి అని ముందుగానే ఆలోచించుకోవటానికి సరైన సమయం. ఇందుకు కావల్సిన ప్రణాళికలను టీవీ షోల ద్వారా, వార్తా పత్రికల ద్వారా, సెమినార్ల ద్వారా తెలుసుకోగలగాలి. వొకేషనల్ గైడెన్స్ తీసుకుంటే అంతకు మించిన అవకాశం మరొకటి ఉండదు. మొదటిగా ఏ విషయం పట్ల ఆసక్తి ఉందో చూసుకోవాలి. దానికి తగ్గ పట్టుదల, కృషి ఉంటే మరొకటి అవసరం లేదు. వీటికి కుటుంబ సభ్యుల సహకారం.. ఆర్థిక అంశాలు - తోడవుతాయి. ఇక ఆరోగ్య విషయం. ఉదాహరణకు - ఆస్త్మాతో బాధపడుతున్నట్లయితే కెమిస్ట్రీ సంబంధిత కోర్సులు తీసుకోక పోవటం ఉత్తమం. దీన్నిబట్టి కెరీర్‌ని ఏ విధంగా మలచుకోవాలన్నది తెలుస్తుంది అంటారామె.
ఇక అలవాట్లూ.. ఆసక్తి కూడా కెరీర్‌కి ప్రాణం. ఒకరికి సంగీతం అంటే ఇష్టం. మరొకరికి ఆర్ట్ అంటే. తల్లిదండ్రులు కూడా పిల్లల అలవాట్లనూ ఆసక్తిని తెలుసుకొని ఆ దిశలో వారిని పయనించేట్టు చేయాలే తప్ప నిరుత్సాహ పరచకూడదు. ఇక పర్సనాలిటీ టెస్ట్‌లూ.. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లూ కెరీర్‌కి ఎంతగానో ఉపకరిస్తాయి. అదీగాక వీలైతే - సైకాలజిస్టులకు తమ తమ మనోభావాలను తెలిపినట్లయితే సరైన గైడెన్స్ ఇవ్వగలరు. అదే మేం చేస్తున్నది కూడా.
నేటి తరం అమ్మాయిలకు ‘సెల్‌ఫోన్ల’లో కబుర్లు చెప్పుకోవటం మినహా.. మరొకటి లేదు. స్నేహం మంచిదే. మాట్లాడుకోవచ్చు. ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకోవచ్చు. ఐతే - అవి ఏ మాత్రం కెరీర్‌కి పనికిరావని తెలిసినా? వాటిని వదిలేసి ఆసక్తికరమైన అంశాల గురించి మాట్లాడండి. ఆ రోజు వార్తాపత్రికల్లో చదివిన అంశాన్నో.. లేక టీవీలో చూసిన ఒక కార్యక్రమం గురించో మాట్లాడితే.. ఎవరు ఏ విధంగా ఆలోచిస్తున్నారన్నది అర్థమవుతుంది. నేటి పోటీ ప్రపంచాన్ని తట్టుకోవాలంటే ఎప్పుడూ ముందడుగులోనే ఉండాలి.
ఏ ఇంటర్వ్యూలోనైనా మొట్టమొదటిగా చూసేది - మీరు అప్లికేషన్ ఏ విధంగా ఇచ్చారన్నది. చాలామంది బయోడేటా.. లేదా రెస్యూమ్ - లాంటి అంశాలతో నింపేసి సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటారు. కానీ.. మీ సర్ట్ఫికెట్ చూస్తే అర్థమయ్యే విషయాన్ని మీ బయోడేటా ఫారమ్‌లో చూడాలని ఎవరూ అనుకోరు. ఏ విషయాన్నైనా కొత్తగా చెప్పారా లేదా అన్నది పరిశీలిస్తారు అంటూ తెలియజేస్తున్నారు.
స్వాతి సలంఖీ రేపటి తరం అమ్మాయిలకు స్ఫూర్తి. ఆమెని ఆదర్శంగా తీసుకోకపోయినా - ఆమె చెప్పే మాటల్ని తీసుకుంటే చాలు.. కెరీర్‌ని మలుపు తిప్పుకోటానికి.

No comments:

Post a Comment