Saturday, December 25, 2010

'స్వీయ ఔన్నత్యం'తో సక్సెస్‌..!

చదవగలిగే మీరు పరీక్షలు వస్తున్నాయంటే ఆందోళన చెందుతున్నారా? సాధించగలిగే సామర్థ్యమున్నా, ఏదీ సాధించలేకపోతున్నారా? 'నేనెందుకూ పనికిరాను' అన్న భావన మీకెప్పుడైనా కలిగిందా? 'అందంగా లేను' అన్న ఫీలింగ్‌ ఇబ్బంది పెడుతోందా? ఇతరులతో పోల్చుకుని భాధపడుతున్నారా? ఇలాంటి ప్రశ్నల్లో అన్నింటికైనా, ఏ ఒక్కదానికైనా అవునని మీ సమాధానం అయితే మీలో 'స్వీయ ఔన్నత్యభావం' (సెల్ఫ్‌ ఎస్టీమ్‌) లేదనే అర్థం.మీమీద మీకు నమ్మకం, గౌరవం, విశ్వాసం ఉండటమే 'స్వీయ ఔన్నత్యభావం' (సెల్ఫ్‌ ఎస్టీమ్‌) అంటారు.ఉదాహరణకు మీరొక వ్యక్తిని గాఢంగా ప్రేమిస్తున్నారనుకుందాం. అతన్ని చూడటం, అతనికి దగ్గరగా ఉండటం, అతనితో మాట్లాడటం లాంటి విషయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ ప్రపంచంలో అందరికంటే అతనే ముఖ్యమైన ఆప్తుడుగా, ఆత్మీయుడుగా అన్పిస్తాడు. అతనికోసం ఏమైనా చేయాలన్పిస్తుంది. ఆగండాగండి... ఒక్క క్షణం... ఓసారి అతని స్థానంలో మిమ్మల్ని ఊహించుకోండి! అతనికోసం చేసే పనులన్నీ మీకోసం చేయండి!! ఎలా ఉంటుంది. అప్పుడు ఏర్పడే భావనే సెల్ఫ్‌ ఎస్టీమ్‌. మీ ఆలోచనల మీదా, మాటల మీదా, చేసే పనులమీదా, ప్రపంచాన్ని అర్థం చేసుకునే తీరుమీదా, ప్రపచంలో మీ స్థానం మీదా, ఇతరులతో మీ సంబంధాల మీదా, మీ జీవితాశయం మీదా, ప్రతి నిర్ణయం మీదా ఈ సెల్ఫ్‌ ఎస్టీమ్‌ ప్రభావం ఎంతో ఉంటుంది. మీరు బాగా డిస్పప్పాయింట్‌ అయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టాలు వెంటాడుతున్నప్పుడు ఈ స్వీయ ఔన్నత్య భావమే మిమ్మల్ని రక్షిస్తుంది. మిమ్మల్ని మీరు ఓదార్చుకోవడం, మీమీద మీకు ఉన్న విశ్వాసం, గౌరవం, ప్రేమ సన్నగిల్లకపోవడం, స్థిరమనస్థత్వం కలిగి ఉండడం సెల్ఫ్‌ ఎస్టీమ్‌కు ప్రతిరూపాలే. ఇది ఉన్నవారు ఎప్పుడూ విజయం సాధిస్తుంటారు. దానివల్ల మరింత ఔన్నత్యం పెరుగుతుంది.ప్రతి మనిషికీ బాల్యం ఒక మధురానుభూతి. భావి జీవితాన్ని ప్రభావితం చేసే భావాలు కూడా ఆ సమయంలోనే నాటుకుపోతాయి. మనిషి శరీరంలో అతివేగంగా అభివృద్ధి చెందే అవయవం మెదడు. తల్లిగర్భం నుంచి బయటపడ్డ బిడ్డ మెదడు పెద్దవాళ్ల మెదడులో 8వ, వంతు సైజులో ఉంటుంది. ఏడాదిన్నర వయసొచ్చేసరికి పెద్దవాళ్ల మెదడులో సంగం సైజుకు చేరుకుంటుంది. ఇలా వేగంగా అభివృద్ధి చెందే బాల్యదశలో అనేక అనుభవాల, అనుభూతుల, జ్ఞాపకాల ముద్రలు మెదడులో నాటుకుపోతాయి. ఒకసారి బలంగా నాటుకుపోయిన ఆలోచనలుగానీ, భావాలుగానీ, గుర్తులుగానీ తర్వాత చెరిపివేయాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అందుకే తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ పిల్లల్ని చిన్నప్పట్నుంచే ఏ విధంగా తీర్చిదిద్దితే, ఏ విధమైన భావాలు వారిలో నింపితే జీవితాంతం ఆ విధమైన వాటికే ప్రభావితమయ్యే అవకాశం ఎక్కువ. పిల్లలకు నైతిక విలువలమీదా, సమాజంలో మసలుకునే తీరుమీదా, ఇతర మంచి విషయాల మీదా, స్వీయ ఔన్నత్య భావం మీదా ట్రీట్‌ చేస్తే పెద్దయ్యాక అవే లక్షణాలు ఎక్కువగా కన్పిస్తాయి. చిన్నప్పుడు చులకనగానో, తిరస్కారంగానో, పెంచితే వారు తమను తాము 'తక్కువ'గా అంచనా వేసుకుంటారు. మానసిక పరిణతి కూడా ఆ విధంగానే అభివృద్ధి చెందుతుంది. పెద్దయ్యాక ఆ ఆ నెగెటివ్‌ అభిప్రాయం అలాగే నిలిచిపోయి ప్రభావితం చేస్తుంది. అది స్వీయ ఔన్నత్యాన్ని దెబ్బ తీస్తుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలు చేసే తప్పుడు పనులకు చీవాట్లు వేయాలి. ఏది మంచో, ఏది చోడో, దేన్ని చేయాలో, దేన్ని చేయకూడదో వివరించాలి. అలా చేస్తే పెద్దయ్యాక కూడా ఆ విధమైన సద్భావనతో ఉంటారు. పిల్లల్ని కించపర్చే విధంగానో, 'నువ్వో పనికి మాలినవాడివ'నో, 'నీకే పనీ చేతకాద'నో అనకూడదు. ఇలాంటివి వారిమెదడులోకి తప్పుడు సంకేతాలు పంపుతాయి. ఆత్మ న్యూనతా భావాన్ని కలుగజేస్తాయి. చిన్నప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నవారే ఎక్కువగా శాడిస్టులుగా, పోకిరీలుగా మారుతుంటారు. యువతనూ ఇలాంటి కొన్ని పరిస్థితులు ప్రభావితం చేస్తుంటాయి.
ఎదిగీ ఎదగని వయస్సులో ప్రపంచమంతా రంగులకలగా కన్పిస్తుంది. ఈ సమయంలో ప్రతి విషయానికీ భావోద్వేగాలకు లోనవుతుంటారు. యుక్తవయస్సులో చోటుచేసుకునే సంఘటనలూ, ఎదురయ్యే సమస్యలూ, తీసుకునే నిర్ణయాలూ భావి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. స్వీయ ఔన్నత్యం లేని వారు వాటికి లొంగిపోయి ఇబ్బందులు పడుతుంటారు. అది ఉన్నవారు ఎప్పుడూ సక్సెస్‌వైపు పరుగెడుతుంటారు.
సెల్ఫ్‌ ఎస్టీమ్‌ పరివర్తనా లక్షణాలు..తమపట్ల తమకు విశ్వాసం నమ్మకం ఉంటుంది.
తమలో ఇతరులు గౌరవించదగ్గ అర్హతలు ఉన్నాయనుకుంటారు.
ఇతరులను ప్రభావితం చేయగలుగుతారు.
పాజిటివ్‌గా ఆలోచిస్తారు.
తమకంటే అధికులైన వారిముందు, అధికారుల ముందు ఎలాంటి భయమూ లేకుండా, కంఫర్టబుల్‌గా ఫీలవుతారు.
ఇతరులు తమను విమర్శించినా, నిందించినా నమ్మిన పనిని సమర్థవంతంగా చేసుకుపోతుంటారు.
బాధ్యతలను, సద్విమర్శలను స్వీకరిస్తారు.
మాటలకంటే, ఆచరణకే ప్రాధాన్యత ఇస్తారు.
ఇతరుల అభిప్రాయాలకు, మాటలకు విలువ ఇస్తారు.
ఒక వ్యక్తిపట్ల ఇష్టంలేకపోతే వారిపట్ల ఎడంగా ఉంటారు తప్ప మనసులో కుళ్లును ఉంచుకుని, మనకసులో ఒకటి పెట్టుకుని, పైకి మరొకటి మాట్లాడరు.
ఇతరుల గురించి తప్పుగా మాట్లాడినప్పుడు అది తప్పు అయితే తమను తాము డిఫెండ్‌ చేసుకోవడానికి వెనుకాడరు.
ఇతరులు తమను గౌరవించాలనీ, అంగీకరించాలనీ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు.
ఇతరులలోని మంచినీ, సమర్థతతనూ, గొప్పతనాన్నీ అంగీకరిస్తారు.
చెప్పాలంటే స్వీయ భావన ఉన్న వ్యక్తి ప్రవర్తన ఉదాత్తంగా, హుందాగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ చలించని మనస్థత్వం కలిగి ఉంటారు.
మీరూ...విజేతలుగా, మార్గదర్శకులుగా, ఆదర్శకులుగా నిలవాలనుకుంటున్నారా? మీరున్న రంగంలో, చదువులో ప్రతిభ కనబర్చాలనుకుంటున్నారా? అయితే వెంటనే 'స్వీయ ఔన్నత్య భావం' అలవర్చుకోండి. అపజయాలను ఎదుర్కోవడానికి అదే సరైన మార్గం.

No comments:

Post a Comment