Saturday, December 25, 2010

సమయ పాలన (టైమ్ మేనేజ్‌మెంట్)


మనిషికైన తాను అనుకున్న దానిని సాధించటానికి ముఖ్యంగా కావాలసినది సమయ పాలన. లోకంలో ఏ మనిషికైన రోజుకు ఉండేది 24 గంటలే. ఎటొచ్చీ ఆ 24 గంటలు సమర్థవంతంగా నిర్వహించుకోవడమే 'టైమ్ మేనేజ్‌మెంట్' అంటారు. ఒక సారి సమయాన్ని పోగొట్టుకుంటే అంటే వృధా చేసుకుంటే మళ్ళీ మనం దానిని ఎప్పటికీ పొందలేము. అందుకే అలాంటి సమయాన్ని ఎంత సమర్థవంతంగా ప్లాన్ వేసుకోవాలో, తద్వారా మన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ మనిషికైనా విజయం వరించాలి అంటే ప్లానింగ్ అవసరం. ప్లానింగ్ లేని మనిషి గమ్యం అగమ్యగోచరంలా ఉంటుంది. ఒక క్రమ పద్దతిలో ప్లాన్ వేసుకుంటే జీవితం నందనభరితం అవుతుంది. కొద్ది పాటి ప్లానింగ్‌తో జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవచ్చునో తెలుసుకుందాం.

  • ఏ పనైనా చేయదలచుకున్నప్పుడు ముందుగా కొంత ప్లాన్ చేసుకుంటే ఎంతో విలువైన సమయాన్ని, డబ్బును ఆదాచేసుకోవచ్చు.

  • ఏ పని చేయటానికైనా గమ్యం నిర్ణయించుకోవటం చాలా ప్రధానమైన కర్తవ్యం. మనం చేయదలచుకున్న పనే లక్ష్యం కదా! వేరే గమ్యం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్న మీలో కలిగిందా? మనం చేయదలచుకున్న పని లక్ష్యం ఏమిటో అనే విషయాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవాలి.

  • లక్ష్యం స్పష్టంగా లేక పోతే చేసేపని దారీ తెన్నూ లేక అగమ్యగోచరంగా తయారవుతుంది. ఈ లక్ష్యాలు రెండు రకాలు.

    • దీర్ఘకాలిక లక్ష్యం

    • స్వల్పకాలిక లక్ష్యం.

  • ఒక ఏడాది నుంచి అయిదేళ్ల మధ్యలో మనం చేయదలచుకున్న గమ్యాన్ని దీర్ఘకాలిక లక్ష్యంగా పేర్కొనవచ్చు. ఒక రోజు నుంచి ఏడాది లోపల మనం చేయాల్సిన పనులు స్వల్పకాలిక లక్ష్యాలవుతాయి.

  • దీర్ఘకాలిక ప్లానింగ్‌కు క్రమశిక్షణ చాలా అవసరం. ఎందుకంటే ఈ గంటలో ఈ పని చేయాలనుకున్నవారు దాన్ని చేయలేనప్పుడు ఇక అయిదేళ్ల వ్యవధిలో మాత్రం తమ ప్లాన్‌ను సక్రమంగా అమలు చేసే అవకాశం ఏముంది?

  • అందుకే ముందుగా మన పరిధి, కాల వ్యవధి ఏమిటో తెలుసుకోవాలి.

  • దానికోసం చిన్న ప్లాన్‌లను అంటే స్వల్పకాలిక ప్లాన్‌లను తయారు చేయటం నేర్చుకోవాలి.

  • ఇందులో రెండు రకాల ఇబ్బందులున్నాయి. ఒకటి సమర్థమైన ప్లానింగ్. రెండోది చేసిన ప్లాన్‌కు, మనసా, వాచా, కర్మణా కట్టుబడి ఉండటం. వీటిని ఇబ్బందులు అని ఎందుకన్నామంటే ఈ రెండూ కూడా ఆచరణలో చాలా కష్టమైనవే.

  • అన్నింటికంటే ముఖ్యంగా ఈ రెండూ ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి.

  • ఆచరణకు వీలయ్యే విధంగా ప్లానింగ్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్న విధంగా ఆచరించాలి.

  • ఆచరణలో మనం ఎంత వేగంగా, ఉన్నాము లేదా నిదానంగా ఉన్నామో, జాగ్రత్తగా ఉన్నామో, నిర్లక్ష్యంగా ఉన్నామో తెలిస్తే అందుకు తగ్గట్లుగా భవిష్యత్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు.

  • ముఖ్యంగా మనం రోజువారి పనుల్లో ఎంత టైమ్ వృధా చేస్తున్నామో, తెలిస్తే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవటమో లేదా దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయ్యటమో తేల్చుకోవచ్చు.

ప్లాన్ చేసుకునేముందు తెలుసుకోవలసిన విషయాలు

  • ప్లాన్ చేసుకునే ముందు అసలు మన పరిస్ధితి ఏమిటి? ఏ పనులు ఎంత సమయంలో ఎంత సమర్ధంగా చేయగలం? మన నైపుణ్యాన్ని ఎక్కడ మెరుగుపరచుకోవాలి? ఏ ఏ ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది? వంటి ప్రశ్నలు వేసుకోవాలి.

  • మొదట మీ గురించి మీరు తెలుసుకోండి. మీ గురించి - అంటే కేవలం మీ శక్తి సామర్ధ్యాలు అనేకాదు, మీ బలహీనతలు, మీ దైనందిన సమస్యలు వంటివి.

  • జీవితంలో ఇప్పటివరకు ఎలాంటి పురోగతిని సాధించాము, ఏ ఏ అంశాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, ఏ ఏ అంశాలు ప్రతికూలంగా నిలిచి మన అభివృద్ధిని అడ్డుకున్నాయి? అన్న ప్రశ్నకు సమాధానాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇందుకోసం గడచిన రోజుల్లోని కొన్ని ముఖ్యమైన సంఘటనలను గుర్తుచేసుకోండి.

  • ఈ సమయాల్లో మీకు ఏ పరిస్ధితులు అనుకూలించాయి. ఏవి ప్రతికూలంగా ఉన్నాయి తెలుసుకోండి.

  • అదేవిధంగా మీ వ్యక్తిగత సామర్ధ్యాలు, బలహీనతలను జ్ఞాపకం చేసుకోండి.

  • మీకు ఎంత బద్ధకం ఉంది. ఎన్ని పనులు చెయ్యగలరు, ఎన్నిటిని వాయిదా వేస్తారు. ఎక్కడ మొహమాటపడతారు, ఏ పనుల్ని పకడ్బందీగా, బాగా చెయ్యాలని తాపత్రయపడి అనవసరంగా ఆలస్యం చేస్తారు, ఇంకా ఏ పనుల్ని అసలు చెయ్యలేమని తెలుసుకోకుండా మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తారు. గత అనుభవాలనుంచి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రాబట్టుకోండి. అప్పుడు మీ శక్తిసామర్ధ్యాలు, బలహీనతల గురించి, పరిస్ధితుల గురించి, చుట్టుపక్కల మిమ్మల్ని ప్రభావితం చేసే అంశాల గురించి మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది. గత అనుభవాల నుంచి పాఠాలను నేర్చుకోవటం అంటే ఇదే.

    ఇక ప్రస్తుత పరిస్ధితుల కొద్దాం. గతానికి, ఇప్పటికీ పరిస్ధితులు మారి ఉంటాయి కదా! ఇప్పుడు మన శక్తిసామర్ధ్యాలు వేరు, పరిస్ధితులు వేరు, వ్యక్తులు మారారు.

    మరి ఇప్పటి సామర్ధ్యాలను తెలుసుకోవటం ఎలా? రేపటి ప్రతి నిమిషానికి ప్లాన్ చేయాలంటే నిన్న ప్రతి నిమిషం ఎలా గడిపారో తెలుసుకోవాలి. మనం గడిపిన ప్రతి నిముషాన్ని భూతద్దంతో పరిశీలించి అది సద్వినియోగమైనదా? లేదా? అని ప్రశ్నించుకున్నప్పుడే సమయాన్ని చక్కగా ఉపయోగించుకోగలము. ఎందుకంటే నిన్న గడిపిన ప్రతి నిమిషం తాలూకా వివరాలు రేపటి భవిష్యత్తును బాగు చేసుకునేందుకు ఉపయోగపడతాయి.

    రేపు చెయ్యాల్సిన పనులను ప్రాధాన్యత ప్రకారం రాసుకుని ఒక్కోపనికి ఎంత సమయం ఇవ్వాలో కేటాయించుకుంటే మన వేగం పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గినకొద్దీ మానసిక ప్రశాంతత పెరిగి మన పనిలో నాణ్యత కూడా పెరుగుతుంది. దాంతో తక్కువ సమయంలో ఎక్కువ పనిని ఇంతకు ముందుకంటే బాగా చెయ్యవచ్చు. ముఖ్యంగా రేపటి రోజును ఎలా గడపాలో ముందే నిర్ణయించుకుంటే జీవితంలో సగం మెట్లు పైకెక్కినట్లే. రేపటి పని ఎలా చెయ్యాలోప్లాన్ చేసుకోకపోతే జీవితం కూడా "గుడ్డెద్దు చేలో పడ్డట్లు" ఎటు వెళ్తున్నామో తెలియకుండా సాగుతుంది. ప్రాధాన్యక్రమాన్ని బట్టి రాసుకున్న పనులకు సమయాలను కూడా చేర్చుకోండి. అప్పుడు ఇంకా ఎంత సమయం మిగిలింది, ఏం పనులు అదనంగా చేయవచ్చు.అనే విషయాలపై అవగాహన వస్తుంది.

ప్లాన్ ప్రకారం పనులు చేయడంలో గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు.

  • చాలామంది ప్లానులు ఘనంగా వేస్తారుకాని ఆచరించరు. ప్లాను వెయ్యటం కంటే దాన్ని ఆచరించటం చాలా ముఖ్యం. ప్లానును కాగితాలకే పరిమితం చెయ్యకుండా ఆచరించటం అలవాటు చేసుకోండి.

  • గడియారం ముల్లు తరుముతున్నట్లు హడావుడిగా ఉండటం నేర్చుకోండి. అలాగని చేసేపనులు చెడగొట్టుకోకూడదు.పనుల మధ్య సమయాన్ని, టీ, కాఫీల సమయాన్ని, బాతాఖానీల సమయాన్ని తగ్గించేయండి.

  • ఈ విధంగా ప్లాన్ ప్రకారం పనులు చేస్తూ ఉంటే ఏదో కొత్త జీవితం ప్రారభించిన ఫీలింగ్ వస్తుంది. భయపడకండి. ఈ కొత్త జీవితంలో మీరు ఇంతకు ముందుకన్నా సుఖంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కొత్త జీవితాన్ని ఆహ్వానించడానికి మానసికంగా సిద్ధంకండి.

  • ఏ రోజు పనులను ఆ రోజు విశ్లేషించి ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకోండి. వాటిని సవరించుకునే ప్రయత్నం చేయండి.

  • ఈ రోజు ప్లాన్లో ఉన్న పనిని రేపటికి వాయిదా వేసే ప్రయత్నం చేయకండి. రేపటి పనులు దెబ్బతింటాయి. ఏదైనా పనిని వాయిదా వేయాల్సి వస్తే దాని స్థానంలో ఇంకో పనిని చేయండి.

  • ఒకరోజు మొదలు పెట్టిన మీ ప్లాన్‌ను రెండు రోజులకి, తరువాత మూడు రోజులకి పెంచే ప్రయత్నం చేయండి. చివరికి ఒక వారం రోజులకి సరిపడ ప్లాన్‌ను తయారు చేసుకుని దానిని ఆచరించేందుకు సిద్దం కండి. అయితే అప్పుడు కూడా రోజువారీ ప్లాన్‌లను తయారుచేసుకోవడం మర్చిపోకండి.

No comments:

Post a Comment