Tuesday, January 25, 2011

పద్మ అవార్డు గ్రహీతలకు అభినందన మందారమాల


తెలుగు తేజం మరోసారి ఇనబింబమై మెరిసింది. అక్కినేని నాగేశ్వర్రావుకు పద్మవిభూషణ్.. గాన గంధర్వుడు ఎస్.బి. బాలసుబ్రమణ్యంకు పద్మభూషణ్.. ఏరువాక సాగారో ఫేం వహీదా రహమాన్‌కు పద్మభూషణ్.. నిన్నటి టాలీవుడ్ హీరోయిన్ టబుకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది భారత ప్రభుత్వం.

అక్కినేని నాగేశ్వరరావు


తెలుగు సినీపరిశ్రమలో నిలువెత్తు శిఖరంగా ఎదిగిన బాలరాజు అయన.. సుదీర్ఘకాలం వెండితెరను ఏలిన దసరాబుల్లోడు.. ప్రేమికుడంటే ఎలా ఉండాలో.. నటనానిర్వచనం ఇచ్చిన దేవదాసు ఆయన.. పద్మశ్రీ.. పద్మభూషణ్.. ఇప్పుడు పద్మ అవార్డుల్లో అత్యున్నత పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న తొలి తెలుగు సినీ వెలుగు ఆయన..
1940లో విడుదలయిన "ధర్మపత్ని" అక్కినేని నాగేశ్వరరావు నటించిన మొదటి చిత్రం. నలబయ్యవ దశకం ఏఎన్నార్‌ కెరీర్‌కి బీజం పడింది. "శ్రీ సీతారామ జననం, మాయలోకం, బాలరాజు, కీలుగుర్రం, లైలా మజ్ను వంటి సినిమాలతో ఎన్నార్‌ కెరీర్‌ ఊపందుకుంది.
ఇక యాభైయవ దశకం అక్కినేని దశను తిరగరాసింది. పౌరణిక సినిమాలతో పాటు సాంఘీక చిత్రాలు చేసిన ఏఎన్నార్‌ ఖాతాలో ఎన్నో సూపర్‌హిట్స్‌ చేరాయి. పరమానంద శిష్యుల కథ, మాయల మరాఠి, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, అల్లావుద్దీన్‌ అద్భుత దీపం, సతీసావిత్రి వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఆరవయ్యో దశకంలోనూ మరెన్నో హిట్స్‌ అక్కినేని ఖాతాలో చేరాయి. పెళ్లికానుక, నమ్మినబంటు, ఇద్దరు మిత్రులు, మంచి మనుషులు, గుండమ్మ కథ, అమరశిల్పి జక్కన్న, డాక్టర్ చక్రవర్తి , ప్రేమించి చూడు, అంతస్తులు, ఆత్మగౌరవం, ఆత్మబలం వంటి సినిమాలు ఏఎన్నార్‌ కెరీర్‌ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళాయి.
డెభ్బయ్యవ దశకం కూడా అక్కినేని హవా వీచింది. డెబ్బయ్యవ దశకం ప్రారంభంలోనే వచ్చిన సినిమా దసరాబుల్లోడు. నాగేశ్వరరావు ఉల్లాసంగా ఉత్సాహంగా వేసిన స్టెప్పలకు ప్రేక్షకులు అదే రీతిలో స్టెప్పులేశారు. ఆనాటి ఏఎన్నార్‌ డాన్స్‌ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌.
దసరాబుల్లోడు తర్వాత అక్కినేని నటించిన మరో భారీ హిట్‌ ప్రేమనగర్‌. తాజ్‌మహల్ కి చరిత్రలో గుర్తింపు ఉన్నట్లే తెలుగు చలనచిత్ర రంగంలో "ప్రేమనగర్"కు ప్రత్యేక గుర్తింపు ఉంది. నలభై ఏళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమాలోని అక్కినేని నటనకు ప్రేక్షకులు జై కొట్టారు.
అక్కినేని నటనాజీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సినిమాలు ఎన్నో ఎన్నెన్నో. డెభ్బయ్యవ దశకంలోనే వచ్చిన మరెన్నో సినిమాలు సూపర్‌ హిట్‌ అయి అక్కినేనిని ఎవర్‌గ్రీన్‌ హీరోగా నిలబెట్టాయి. భక్తతుకారాం, అందాల రాముడు, ప్రేమలు పెళ్ళిళ్లు వంటి సినిమాల్లో అక్కినేని నటనకు మంచి పేరు వచ్చింది.
భగ్న ప్రేమికుడిగా ఏఎన్నార్‌ నటించిన సినిమాలన్నీ సూపర్‌ హిట్సే. ప్రేమాభిషేకం, ప్రేమమందిరం, లైలా మజ్ను, దేవదాసు అనార్కలి.. వంటి సినిమాలు అక్కినేని కెరీర్‌ను ఆకాశానికెత్తేశాయి.
ఎన్టీఆర్‌, గుమ్మడి, ఎస్వీరంగరావు వంటి ఆనాటి అగ్రనటులుతో ఏఎన్నార్‌ కలిసి నటించిన సూపర్‌ హిట్‌ మూవీ మాయాబజార్. అభిమన్యుడిగా అక్కినేని నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. కలర్‌లోనూ వచ్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అయింది.
ఏఎన్నార్ తన తనయుడు నాగార్జునతో పోటీపడి 'రామదాసు' చిత్రంలో నటించారు. తనలో ఇంకా ఉత్సాహం తగ్గలేదని నిరూపించారు. కబీర్‌దాసు పాత్రలో నటించి అలరించారు. తాజాగా బాపు దర్శకత్వంలో బాలకృష్ణ శ్రీరాముడుగా నటిస్తున్న శ్రీరామరాజ్యం సినిమాలో వాల్మీకిగా చెయ్యబోతున్నారు అక్కినేని.

//////////////////////////////////////////////////////////////////////////////
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించింది . తన గాన మాధుర్యంతో భారతీయ భాషలన్నింటిలోనూ శ్రోతలను అలరిస్తున్న రాగాల రారాజు బాలు. ఆ గళంలో పలకని రాగంలేదు. భావం లేదు. గొంతులు మార్చి మార్చిపాడి చలాకీగా చకచకాసాగిపోయే పాటలతోసంగీత అభిమానులనురసగంగలో ముంచెత్తుతూనేఉన్నారాయన .

సంగీత దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మనందరినీ అలరిస్తున్న రాగాల రారాజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

మద్రాసులో జరిగిన ఒక సంగీత పోటీలో ప్రముఖ సంగీత దర్శకుడు కోదండపాణి దృష్టిలో పడ్డారు. దీంతో కోదండపాణి సంగీత దర్శకత్వంలో పద్మనాభం నటించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాతో సినీగాయకునిగా అడుగుపెట్టారు. తనకు సినీ గాయకుడిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని పేరు పెట్టుకున్నారు బాలు.

తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాధుర్యాన్ని గమనించి ఆయన చేసే ఉచ్ఛారణ ఆయన పాటను పండిత పామరులకి చేరువ చేసింది.
శంకరాభరణం చిత్రంలోని శాస్త్రీయ సంగీత బాణీలతో కూర్చబడిన పాటలను అజరామరమైన రీతిలో ఆలపించి దక్షిణ భారత సినీ గాయకులలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు బాలు.
40 ఏళ్ళ సినీప్రస్థానంలో 11 భాషలలో 40 వేలకు పైగా పాటలు పాడి, 40 కి పైగా సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి అరుదైన రికార్డు సృష్టించిన ఘనత ఆయనది. ఒకరికా.. ఇద్దరికా.. ఏంతో మంది నటులకు ఆయన గాత్ర దానం చేశారు. ఆయన నందమూరి తారక రామరావుకి పాడితే అచ్చంగా ఆయన పాడినట్లే ఉంటుంది. అదే అక్కినేని నాగేశ్వరరావుకి పాడితే నిజంగా ఆయనే పాడినట్లుంటుంది. అలాగే కృష్ణ, శోభన్ బాబు, అల్లు రామలింగయ్య, రాజబాబు, సుత్తివేలు.. వంటి నటులకూ బాలు వారి గాత్రాన్ని ఇమిటేట్‍ చేస్తూ అలాగే పాడేవారు. ఆయన పాడిన పాటల్లో ఎన్నో ఆణిముత్యాలు. ఒకే రోజున తమిళంలో 19 పాటలు, ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు కన్నడంలో 17 పాటలు పాడి గిన్నీస్ బుక్ లో తన పేరు నమోదుచేసుకున్నారు బాలు. ఇక ఆయన్ని వరించిన అవార్డులు, రివార్డులకు అంతే లేదు. శంకరాభరణం, సాగర సంగమం, రుద్రవీణతో పాటు మిగత భాషల చిత్రాల్లో పాడినందకు గాను ఆయనకు ఆరు జాతీయ అవార్డులు లభించాయి. నటుడిగానూ అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు ఎస్పీ బాలు. గాయకుడుగానే కాకుండా సంగీత దర్శకుడుగా, నటుడుగా, చిత్ర నిర్మాతగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, కోదండపాణి థియేటర్‌ అధినేతగా రాణిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. కళారంగంలో ఆయన అందిస్తున్న సేవలకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించింది.

/////////
టబు

హైదరాబాద్‌ అమ్మాయి టబుకు భారతప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఎటో వెళ్లిపోయింది మనసు... అంటూ ఓ పుష్కరం క్రితం యూత్‌ కు గుబులెక్కించిన టబు బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా కొన్నేళ్ళ పాటూ రాజ్యమేలింది.
మన హైదరాబాద్‌ అమ్మాయి టబు. టబుస్సుమ హష్మి. షబనాఆజ్మి మేనకోడలు. హమ్‌నౌజవాన్‌ సినిమాతో ఆరంగేట్రం చేసింది ఈ నైజాం పోరి. ఎనిమిదేళ్లకు పైగా అష్టకష్టాలు పడి చివరికి నాగార్జునతో నటించిన నిన్నేపెళ్లాడతా సినిమాతో తారాపథంలో నిలిచింది. తన కలల రాకుమారుడు ఎలా ఉండాలో తల్లికి చెబుతూ పాడే పాటలో అచ్చమైన తెలుగింటి మోడ్రన్‌ అమ్మాయిగా అందరి మనసులు గెలుచుకుంది.
నిన్నే పెళ్ళాడుతా తర్వాత టబు బాలీవుడ్‌లో ఆల్ టైమ్ క్లాసిక్స్ లాంటి మాచిస్.. విరాసత్.. బోర్డర్ లాంటి సినిమాల్లో నటించి తనేంటో ప్రూవ్ చేసుకుంది. పాత్ర ఎలాంటి దైనా తనదైన ముద్ర వేసుకునే టబుకు కళ్ళతో ఎలాంటి భావాన్నయినా పలికించగలదనే పేరు ఉంది.
తెలుగులో నాగార్జునతో మళ్ళీ ఆవిడే మా ఆవిడలో నటించింది. హమ్ సాథ్ సాథ్ హై.. హై తూతూ.. బీవి నంబర్ వన్.. తక్షక్.. లాంటి ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో బిజీ అయిపోయింది. చాందినీ బార్ లో డాన్సింగ్ గర్ల్ గా ఆమె అభినయానికి నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకుంది.
అందరివాడు.. షాక్.. ఇదీ సంగతి.. పాండురంగడు.. లాంటి తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడూ కనపించినా టబు అంటే బరువైన పాత్రల్లో ఈజ్ ప్రదర్శించే నటిగా మనకు గుర్తుండిపోతుంది. చీనికమ్ లో అమితాబ్ తో పోటి పడి అద్భుతమైన నటన ప్రదర్శించింది.

1 comment:

  1. నా అభిమాన నటుడు ఆక్కినేనికి, అభిమాన గాయకుడు బాలు గార్లకు
    పద్మవిభూషణ్, పద్మభూషణ్ వచ్చినందుకు ఆనందించాను. కానీ బాపు,
    రమణలను ఇప్పటికీ పద్మశ్రీలతో సత్కరించకబోవడం మన తెలుగువాళ్ళ
    దౌర్భాగ్యం!

    ReplyDelete